- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్ర ప్రజలకు షాక్.. ప్రజల నెత్తిన విద్యుత్ సర్‌ఛార్జ్ భారం

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రజలకు షాకిచ్చింది. ఎండలతో అల్లాడిపోతున్న ప్రజల నెత్తిన.. అదనపు భారాన్ని మోపింది. ఉత్తరప్రదేశ్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (UPPCL) విద్యుత్ బిల్లులపై 10 శాతం ఇంధన, విద్యుత్ కొనుగోలు సర్దుబాటు సర్ ఛార్జ్ (FPPAS) ను విధిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ నెలలో జనరేట్ అయ్యే కరెంట్ బిల్లులకు ఇది వర్తిస్తుందని, దీనివల్ల రాష్ట్రంలోని అన్ని వర్గాల వినియోగదారులపై అదనపు భారం పడనుందని అధికారులు తెలిపారు.
మార్చి నెల ఖర్చు.. జూన్ బిల్లులో వసూలు
ఉత్తరప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (UPERC) నిబంధనల ప్రకారం.. విద్యుత్ కొనుగోలు, సరఫరా (ట్రాన్స్‌మిషన్) కోసం అయిన అదనపు వ్యయాన్ని రికవరీ చేసేందుకే ఈ సర్‌ఛార్జ్‌ను విధించినట్లు మే 29న విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఇంధన ధరల హెచ్చుతగ్గులు, ఇతర వనరుల నుండి కొనుగోలు చేసే విద్యుత్ ధరలు పెరిగినప్పుడు పంపిణీ సంస్థలకు జరిగే నష్టాన్ని పూడ్చడానికి ఈ విధానాన్ని అమలు చేస్తారు. ఈ క్రమంలో గడిచిన మార్చి నెలకు సంబంధించిన 10 శాతం పెరిగిన వ్యయాన్ని, జూన్ నెల విద్యుత్ బిల్లుల ద్వారా వినియోగదారుల నుండి వసూలు చేయనున్నారు.
ఒకవైపు కోతలు.. మరోవైపు 5,000 మెగావాట్ల అదనపు డిమాండ్
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ దాటిపోవడంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో ఒకవైపు గంటల తరబడి అప్రకటిత విద్యుత్ కోతలు విధిస్తూ, మరోవైపు బిల్లులు పెంచడంపై ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎండల తీవ్రత కారణంగా ఇళ్లు, వ్యాపార సముదాయాలు, పరిశ్రమలలో కూలర్లు, ఏసీల వినియోగం విపరీతంగా పెరిగింది. ఫలితంగా గతేడాదితో పోలిస్తే ఈసారి రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ ఏకంగా 5,000 మెగావాట్లకు పైగా పెరగడం గమనార్హం.
డిమాండ్‌కు తగ్గట్టు లేని మౌలిక వసతులు
గడిచిన కొన్నేళ్లుగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ సరఫరా వ్యవస్థను మెరుగుపరిచినప్పటికీ, మౌలిక వసతుల విస్తరణ వేగం పెరిగిన డిమాండ్‌కు సరిపోవడం లేదని ప్రభుత్వ అధికారులు సైతం అంగీకరిస్తున్నారు. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా గ్రిడ్ సామర్థ్యం పెరగకపోవడం వల్లే ప్రస్తుతం ఈ లోడ్ షెడ్డింగ్ సమస్యలు తలెత్తుతున్నాయని తెలుస్తోంది.






