ప్రారంభమైన 12 రోజుల్లోనే కుంగిన యూపీ ఎక్స్‌ప్రెస్‌వే.. నిర్మాణ నాణ్యతపై విమర్శలు

by Ramesh Naini |

వేల కోట్లు వెచ్చించి, అత్యధునిక సాంకేతికతతో నిర్మించిన ఉత్తరప్రదేశ్‌లోని ‘లక్నో-కాన్పూర్ గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌వే’ ప్రారంభమైన కేవలం 12 రోజుల్లోనే దెబ్బతిన్నదని ఆరోపణలు వస్తున్నాయి.

ప్రారంభమైన 12 రోజుల్లోనే కుంగిన యూపీ ఎక్స్‌ప్రెస్‌వే.. నిర్మాణ నాణ్యతపై విమర్శలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: వేల కోట్లు వెచ్చించి, అత్యధునిక సాంకేతికతతో నిర్మించిన ఉత్తరప్రదేశ్‌లోని ‘లక్నో-కాన్పూర్ గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌వే’ ప్రారంభమైన కేవలం 12 రోజుల్లోనే దెబ్బతిన్నదని ఆరోపణలు వస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా ఉన్నావ్ జిల్లా కోరారి గ్రామం సమీపంలో రోడ్డు కుంగిపోవడం నిర్మాణ నాణ్యతపై తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది.

12 రోజులకే పగుళ్లు.. వైరల్

జూలై 13న కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ రహదారిని అట్టహాసంగా ప్రారంభించారు. అయితే, భారీ వర్షాలకు కాన్పూర్-లక్నో మార్గంలో మట్టి జారిపోయి సుమారు 5 నుంచి 7 మీటర్ల మేర రోడ్డు కుంగిపోయింది. కుంగిపోయిన రోడ్డుకు సంబంధించిన వీడియోను సమాజ్‌వాదీ పార్టీ (SP) నేత మధుసూదన్ యాదవ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. కాంట్రాక్ట్ ఏజెన్సీల పనితీరు, నాణ్యతా లోపాలపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ పెద్దలు చెప్పిన మాటలన్నీ నీటిమూటలేనని ఎద్దేవా చేశారు. విషయం వెలుగులోకి రావడంతో స్పందించిన అధికారులు, దెబ్బతిన్న భాగానికి ప్యాచ్‌వర్క్ చేసి తాత్కాలికంగా మరమ్మతులు పూర్తి చేశారు.

ప్రాజెక్టు ప్రత్యేకతలు..

రూ. 4,700 కోట్ల వ్యయంతో 63 కిలోమీటర్ల మేర 6 లైన్లుగా ఈ ఎక్స్‌ప్రెస్‌వేను నిర్మించారు. ఏఐ (AI) స్పీడ్ ట్రాకింగ్, ఎమర్జెన్సీ కాల్ బాక్స్‌లు వంటి అధునాతన సదుపాయాలు ఇందులో ఉన్నాయి. దీనిపై కారుకు రూ.275 టోల్ ఫీజు వసూలు చేస్తుండగా, ద్విచక్ర వాహనాలకు అనుమతి లేదు. గతంలో నిర్మాణ దశలో ఉన్నప్పుడు కూడా ఈ ఎక్స్‌ప్రెస్‌వే ఒకసారి దెబ్బతినడం గమనార్హం. ప్రారంభించిన కొద్ది రోజులకే మళ్లీ అదే పరిస్థితి తలెత్తడంతో ప్రజలు, ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Next Story