Heavy Rains: భారీ వర్షాలు.. 14 మంది మృతి, ఆరెంజ్ అలర్ట్ జారీ

by Naga Rani Yarlagadda |

మే మొదటివారంలో గుజరాత్‌లో అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షాలు, పిడుగుల కారణంగా 14 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు.

Heavy Rains: భారీ వర్షాలు.. 14 మంది మృతి, ఆరెంజ్ అలర్ట్ జారీ
X

దిశ, వెబ్‌డెస్క్: మే మొదటివారంలో గుజరాత్‌లో అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షాలు (Heavy Rains), పిడుగుల (Thunder Storms) కారణంగా 14 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. ఆదివారం (మే 4) పిడుగుపాటు కారణంగా ఒకరు మరణించగా.. సోమవారం మరో 13 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. బలమైన గాలులతో పాటు భారీ వర్షాలు పడటంతో అనేక ప్రాంతాల్లో భారీగా పంటనష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు. అహ్మదాబాద్‌లోని విరామ్‌గామ్‌లో ఆదివారం పిడుగుపాటుకు స్థానిక వ్యక్తి అయిన మంగాజీభాయ్ ఠాకూర్ మరణించాడని చెప్పారు. కాగా.. మరికొద్ది రోజులపాటు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది.

వడోదరలో గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయగా.. కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వర్షం కురిసినట్లు నివేదించారు. పశువుల మేత సహా పెసరపప్పు, చోలి, బజ్రా, మామిడి, బొప్పాయి వంటి పంటలన్నీ వర్షార్పణమయ్యాయి. సోమవారం రాత్రి 11 గంటల తర్వాత కురిసిన భారీ వర్షం.. మకర్బా, సౌత్ భోపాల్, మణినగర్, మోటెరా, శ్యామల్, ప్రహ్లాద్‌నగర్ వంటి ప్రాంతాలను ప్రభావితం చేసింది. అహ్మదాబాద్ మున్సిపల్ పరిధిలో 75 చెట్లు కూలిపోగా.. 15 వాహనాలు దెబ్బతిన్నాయి. కొన్నిప్రాంతాల్లో ఇళ్ల పైకప్పు షీట్లు ఎగిరిపోయాయి. మే6 నుంచి 8వ తేదీ వరకూ రాష్ట్రంలోని బనస్కాంత, పటాన్, మెహసానా, సబర్కాంత, ఆరావళి, పంచమహల్, దాహోద్, మహిసాగర్, రాజ్‌కోట్, మోర్బి, కచ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, స్థానికులు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది.

Next Story