ర్యాగింగ్ భూతానికి విద్యార్థిని బలి.. UGC సీరియస్

by Naga Rani Yarlagadda |

హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో ర్యాగింగ్ భూతానికి మరో విద్యార్థిని బలైంది. ఈ ఘటనపై యూజీసీ తీవ్రంగా స్పందించింది.

ర్యాగింగ్ భూతానికి విద్యార్థిని బలి.. UGC సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో ర్యాగింగ్ భూతానికి మరో విద్యార్థిని బలైంది. సీనియర్లతో పాటు ప్రొఫెసర్ టార్చర్ పెట్టడంతో మానసిక వేదనకు గురైన విద్యార్థిని తీవ్ర అనారోగ్యానికి గురై మరణించింది. స్థానిక ప్రభుత్వ కాలేజీలో డిగ్రీ సెకండియర్ చదుుతున్న యువతిని సీనియర్లు, లెక్చరర్ తీవ్రంగా వేధించారు. గతేడాది సెప్టెంబర్18న ముగ్గురు సీనియర్లు ర్యాగింగ్ పేరుతో దారుణంగా ప్రవర్తించగా.. ప్రొఫెసర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. వారి టార్చర్, లైంగిక వేధింపులతో విద్యార్థిని తీవ్ర మానసిక ఒత్తిడికి గురైంది. అనారోగ్యం పాలవ్వడంతో తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం లుథియానా ఆస్పత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో విద్యార్థిని చికిత్స పొందుతూ డిసెంబర్ 26న మరణించింది.

ఈ ఘటనపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) ఒక నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసి దర్యాప్తునకు ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. ర్యాగింగ్ ఆత్మహత్యకు దారితీసిందని ఆరోపిస్తూ.. మీడియా నివేదికల ఆధారంగా UGC యాంటీ-ర్యాగింగ్ హెల్ప్‌లైన్ సుమోటోగా ఫిర్యాదును నమోదు చేసింది. ఇప్పటికే పోలీసులు ముగ్గురు విద్యార్థులు, ప్రొఫెసర్ పై విద్యార్థిని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. వేధించిన ముగ్గురు సీనియర్లు కూడా విద్యార్థినులే కావడం గమనార్హం. సెప్టెంబర్ 18న హర్షిత, ఆకృతి, కొమోలికా అనే ముగ్గురు సీనియర్లు బాధిత విద్యార్థినిని తీవ్రంగా కొట్టారని, ప్రొఫెసర్ అశోక్ కుమార్ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ కుమార్తె మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Next Story