Hardeep Puri: నీళ్లలో దూకమనండి.. కానీ, అవే లేనప్పుడు ఎలా?.. పాక్ మాజీ మంత్రికి కేంద్ర మంత్రి కౌంటర్

by Shamantha N |

పెహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమయ్యాయి. సింధూ జలాలను ఆపితే రక్తం ప్రవహిస్తోంది అంటూ పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావ‌ల్ భుట్టో-జ‌ర్దారి భారత్ పై నోరుపారేసుకున్నారు.

Hardeep Puri: నీళ్లలో దూకమనండి.. కానీ, అవే లేనప్పుడు ఎలా?.. పాక్ మాజీ మంత్రికి కేంద్ర మంత్రి కౌంటర్
X

దిశ, నేషనల్ బ్యూరో: పెహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమయ్యాయి. సింధూ జలాలను ఆపితే రక్తం ప్రవహిస్తోంది అంటూ పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావ‌ల్ భుట్టో-జ‌ర్దారి భారత్ పై నోరుపారేసుకున్నారు. కాగా.. ఈ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ.. ‘‘ నేను అతడి(భుట్టో) ప్రకటన విన్నాను. నీళ్లలో ఎక్కడైనా దూకమనండి. అయితే, నీరు లేనప్పుడు అతను ఎలా దూకగలడు..? అలాంటి ప్రకటనల్ని పట్టించుకోవద్దు. వారికే తర్వాత అర్థం అవుతుంది. నిస్సందేహంగా పొరుగు దేశం చేసిన సరిహద్దు ఉగ్రదాడే పెహల్గాం ఘటన. దీనికి వారు బాధ్యత వహించాల్సిందే. మునుపటిలా కాకుండా, ఇప్పుడు ఏ వ్యాపారం కొనసాగదు. ప్రధాని మోడీ చెప్పినట్లుగా పాకిస్థాన్ భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఆరంభం మాత్రమే. ఉగ్రవాదులు దారుణానికి పాల్పడ్డారు. దీన్ని ప్రపంచం మొత్తం ఖండిస్తోంది. పాకిస్థాన్ మోసపూరిత దేశం మాత్రమే కాదు.. అంతిమ క్షీణతలో ఉన్న దేశం’’ అని అన్నారు.

లండన్ ఘటనపై..

లండన్‌లోని పాకిస్థాన్ హైకమిషన్‌లో అధికారి కల్నల్ తైమూర్ భారతీయుల గొంతు కోస్తాననే అర్థం వచ్చేలా ప్రవర్తించిన ఘటన కలకలం రేపుతోంది. దీనిపై పూరి మాట్లాడారు. పాకిస్తాన్ టెర్రర్ స్పాన్సర్డ్ దేశం, వారు మూల్యం చెల్లించుకోవాల్సిన స్థితిలో ఉన్నారని మండిపడ్డారు. ఇప్పుడు సింధు జల ఒప్పందం నుంచి పాక్ బయటపడగలమని భావిస్తే.. వారికి ఐ విష్ దెమ్ బెస్ట్ ఆఫ్ లక్ అని చురకలు అంటించారు. ఇకపోతే, ఏప్రిల్ 22న పెహల్గాంలో పర్యాటకులపై ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో 26 మంది చనిపోయారు. కాగా..ఉగ్రవాదులను పట్టుకోవడానికి సైన్యం భారీ వేట ప్రారంభించింది. సైన్యం, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), జమ్ముకశ్మీర్ పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు.

Next Story