Chirag Paswan: బిహార్ రాజకీయాలపై చిరాగ్ పాశ్వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Shamantha N |   (  Updated:2025-06-02 12:27:14  IST  )

కేంద్ర ఆహార ప్రాసెసింగ్ శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్ తాజాగా బిహార్ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బిహార్, బిహారీల అభివృద్ధి కోసమేనని తాను రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు. దేశంలోని అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో బిహార్ ను సమానంగా చూడడమే తన కల అని పేర్కొన్నారు.

Chirag Paswan: బిహార్ రాజకీయాలపై చిరాగ్ పాశ్వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ డెస్క్: కేంద్ర ఆహార ప్రాసెసింగ్ శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్ బిహార్ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బిహార్, బిహారీల అభివృద్ధి కోసమేనని తాను రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు. దేశంలోని అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో బిహార్ ను సమానంగా చూడడమే తన కల అని పేర్కొన్నారు. తాను మూడోసారి ఎంపీగా ఎన్నికైన తర్వాత ఒక విషయం స్పష్టమైందని, ఢిల్లీలో ఉండి బిహార్‌ అభివృద్ధిని సాధించలేమని చెప్పారు. అందుకే పార్టీకి తన అభిప్రాయాన్ని తెలియజేశానని, త్వరలోనే బిహార్‌కు తిరిగి వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు. తాను బిహార్ ముఖ్యమంత్రి పీఠంపై ఆశలు పెట్టుకున్నానన్న వార్తలపై స్పందించిన చిరాగ్ పాశ్వాన్, ప్రస్తుతం ఆ పదవి ఖాళీ లేదని స్పష్టం చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా నితీశ్ కుమారే సీఎం అవుతారనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

బిహార్ ఫస్ట్.. బిహారీ ఫస్ట్ అనే నినాదంతో ముందుకు

2024 లోక్‌సభ ఎన్నికల్లో లోక్ జనశక్తి పార్టీ (రాంవిలాస్) ఐదు ఎంపీ సీట్లు గెలుచుకుంది. దళిత ఓటు బ్యాంక్‌లో 6 శాతం మద్దతుతో పాటు పాశ్వాన్ వర్గానికి ఉన్న బలాన్ని పార్టీ వ్యూహాత్మకంగా వినియోగించుకుంటోంది. దీంతో బిహార్ అసెంబ్లీ సీట్లలో ఎన్డీఏలో ఎక్కువ వాటా కోరుతూ బీజేపీపై చిరాగ్ ఒత్తిడి తీసుకురావచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల ‘బిహార్ ఫస్ట్, బిహారి ఫస్ట్’ నినాదంతో చిరాగ్ పాశ్వాన్ బిహార్‌లో పబ్లిక్ మీటింగ్‌లు, సభలు నిర్వహిస్తున్నారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన జేడీయూపై 130కి పైగా స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టి పోటీ చేయడంతో, జేడీయూ కేవలం 43 సీట్లు మాత్రమే గెలిచి మూడో స్థానానికి పరిమితమైంది. అప్పట్లో ఇది బీజేపీ వ్యూహమేనన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ప్రస్తుతం చిరాగ్ పాశ్వాన్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ, సంపూర్ణ దృష్టి బిహార్ అభివృద్ధిపైనే ఉంది. నా రాజకీయ ప్రయాణం బిహార్‌తోనే మొదలైంది. అక్కడికే తిరిగి వెళ్లాలనుంది అని తన అభిప్రాయాన్ని తెలియజేశారు.

Next Story