Unesco: మరాఠా సామ్రాజ్యానికి యునెస్కో గుర్తింపు.. 12 కోటలకు వారసత్వ హోదా

by B.Srinivas |

భారత్‌లోని 12 కోటలకు యునెస్కో వారసత్వ గుర్తింపు ఇచ్చింది. మరాఠా కాలం నాటి ఈ కోటల్లో మహారాష్ట్రలోని 11, తమిళనాడులోని ఒక కోట ఉంది.

Unesco: మరాఠా సామ్రాజ్యానికి యునెస్కో గుర్తింపు.. 12 కోటలకు వారసత్వ హోదా
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌లోని 12 కోటలకు యునెస్కో వారసత్వ గుర్తింపు ఇచ్చింది. మరాఠా కాలం నాటి ఈ కోటల్లో మహారాష్ట్రలోని 11, తమిళనాడులోని ఒక కోట ఉంది. యునెస్కో గుర్తించిన కోటల జాబితాలో మహారాష్ట్రలోని రాయ్‌గడ్, రాజ్ గఢ్, ప్రతాప్‌గడ్, పన్హాలా, శివనేరి, లోహ్‌గడ్, సల్హేర్, సింధుదుర్గ్, సువర్ణదుర్గ్, విజయదుర్గ్, ఖండేరి ఉండగా.. తమిళనాడులోని గింగీ కోట ఉంది. పారిస్‌లో తాజాగా జరిగిన ప్రపంచ వారసత్వ కమిటీ (WHC) 47వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కోటలు 17,19వ శతాబ్దాలలో నిర్మించబడ్డాయి. మరాఠా సామ్రాజ్యానికి ప్రత్యేకమైన సైనిక వ్యూహం కోటల నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తుంది. వీటిని యునెస్కో వారసత్వ జాబితాలో చేర్చాలని ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రతిపాదించారు. ఈ క్రమంలోనే దానికి ఆమోదం లభించింది. యునెస్కోలో భారత రాయబారి విశాల్ శర్మ దీనిపై అధికారిక ప్రకటన చేశారు. ‘భారత్, ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మరాఠీ ప్రజలకు చారిత్రాత్మక రోజు’ అని పేర్కొన్నారు. దీంతో భారతదేశంలోని మొత్తం 44 వారసత్వ ప్రదేశాలు ఇప్పటి వరకు ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చారు.

ప్రతి భారతీయుడికీ గర్వకారణం: మోడీ

యునెస్కో వారసత్వ హోదా దక్కడంపై ప్రధాని మోడీ స్పందించారు. ఇది ప్రతి భారతీయుడికి గర్వకారణమని అభివర్ణించారు. ‘ మరాఠా సైనిక ప్రకృతి దృశ్యాల్లో 12 గంభీరమైన కోటలు ఉన్నాయి. పౌరులు ఈ ప్రదేశాలను సందర్శించి సామ్రాజ్యానికి సంబంధించిన అద్భుతమైన విషయాలను తెలుసుకోవాలి’ అని పేర్కొన్నారు. కేంద్ర సాంస్కృతిక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ దీనిని భారతదేశానికి గర్వకారణమైన రోజుగా అభివర్ణించారు.

Next Story