- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pahalgam Terror attack: జమ్ముకశ్మీర్ ఉగ్రదాడిని ఖండించిన ఐక్యరాజ్యసమితి
జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిని ఐక్యరాజ్యసమితి ఖండించింది. పౌరులపై దాడులు ఆమోదయోగ్యం కాదని యూఎన్ ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటారెస్ అన్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిని ఐక్యరాజ్యసమితి ఖండించింది. పౌరులపై దాడులు ఆమోదయోగ్యం కాదని యూఎన్ ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటారెస్ అన్నారు. ఈ ఘటనను గుటారెస్ ఖండించినట్లు యూఎన్ సెక్రటరీ జనరల్ అధికార ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ అన్నారు. బాధితులను కోల్పోయిన కుటుంబాలకు సంతాపాన్ని తెలిపారు. మరోవైపు, మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన అనంత్‌నాగ్ జిల్లా పహల్గాం సమీప బైసరన్ లోయలోని పచ్చని మైదానంలో విహరిస్తున్న పర్యాటకులపై సాయుధ ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం 3గంటల సమయంలో జరిగింది. మహిళలు, చిన్నారులను వదిలిపెట్టి పురుషులే లక్ష్యంగా దాడి చేశారు. 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు విదేశీయులున్నట్లు అధికారులు గుర్తించారు.
ఇద్దరు ముష్కరులు హతం
కాల్పుల తర్వాత అడవుల్లోకి పారిపోయిన ఉగ్రవాదుల కోసం భద్రతాబలగాలు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టాయి. బుధవారం భారత్‌లో ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న ముష్కరులను సైన్యం గుర్తించింది. ఈక్రమంలో ఎన్‌కౌంటర్ కొనసాగుతున్నట్లు చినార్ కోర్ ఎక్స్ ఖాతాలో ప్రకటించింది. ఉరి నాలా వద్ద సర్జీవన్ అనే ప్రాంతం నుంచి దేశంలోకి ప్రవేశిస్తుండగా ఆపరేషన్ చేపట్టారు. ఇప్పటివరకు ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టినట్లు ఆర్మీ వెల్లడించింది. ఘటనాస్థలంలో భారీగా మందుగుండు సామగ్రి, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. ఇక పహల్గామ్ దాడిలో పాల్గొన్న ఓ ఉగ్రవాదిగా భావిస్తున్న వ్యక్తి ఫొటో వైరల్‌గా మారింది. లాల్చీ పైజామా ధరించిన అతడి చేతిలో ఆటోమేటిక్ రైఫిల్ స్పష్టంగా కనిపిస్తోంది. దీన్ని అధికారిక వర్గాలు ధ్రువీకరించాల్సి ఉంది.
మోడీ సౌదీ అరేబియా పర్యటన కుదింపు
మోడీ తన సౌదీ అరేబియా పర్యటనను కుదించుకొని హుటాహుటిన భారత్ చేరుకున్నారు. బుధవారం ఉదయం ఢఇల్లీ ఎయిర్‌పోర్టులో దిగిన ప్రధాని మోడీ (PM Modi).. విమానాశ్రయంలోనే అత్యవసర సమావేశం నిర్వహించారు. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీతో భేటీ అయ్యారు. దాడి గురించి చర్చించారు. మరోవైపు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా తన అమెరికా పర్యటనను కుదించుకుని భారత్‌కు తిరుగుపయనమయ్యారు. మంగళవారం రాత్రి శ్రీనగర్ చేరుకున్న కేంద్రహోంమంత్రి అమిత్ షా.. భద్రతా సంస్థల ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితులను సమీక్షించారు.






