UNSC: కౌంటర్ టెర్రరిజం కమిటీకి పాక్ వైస్ ఛైర్మనా?

by Shamantha N |

ఉగ్రవాదంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌ను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి కౌంటర్‌ టెర్రరిజం కమిటీ వైస్‌ ఛైర్మన్‌గా చేయడాన్ని ఖర్గే తప్పుపట్టారు.

UNSC: కౌంటర్ టెర్రరిజం కమిటీకి పాక్ వైస్ ఛైర్మనా?
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉగ్రవాదంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌ను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి కౌంటర్‌ టెర్రరిజం కమిటీ వైస్‌ ఛైర్మన్‌గా చేయడం.. తాలిబన్‌ శాంక్షన్‌ కమిటీకి 2025కు గాను అధ్యక్షత అప్పగించడాన్ని ఖర్గే తప్పుపట్టారు. ఈ మేరకు సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్టు పెట్టారు. ఇది పూర్తిగా దురదృష్టం, అజ్ఞానం, ఏమాత్రం ఆమోదయోగ్యం కానిదన్నారు. టెర్రర్ ఫైనాన్స్‌పై నిఘా కోసం పాకిస్థాన్‌ను ఆర్థిక కార్యదళం గ్రేలిస్ట్‌లో తిరిగి చేర్చాలన్న భారత్‌ డిమాండ్‌లోని వాస్తవాన్ని గమనించాలన్నారు. ఇది కేవలం భారత్‌ కోసం కాదని.. అంతర్జాతీయ సమాజం ప్రయోజనాల కోసం అవసరమన్నారు. మోస్ట్‌వాంటెడ్‌ ఉగ్రవాది ఒసామా బిన్‌ లాడెన్‌ పాకిస్థాన్‌లోనే హతమయ్యాడన్న విషయాన్ని గుర్తు చేశారు.

ప్రపంచదేశాలు మద్దతు ఇవ్వాలని..

పాక్‌ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న భారత్‌కు ప్రపంచ దేశాలు మద్దతు ఇవ్వాలని ఖర్గే అభ్యర్థించారు. ఇటీవలే పాక్‌కు బెయిల్‌ఔట్‌ ప్యాకేజీలు, రుణాలు లభించిన మొత్తాన్ని పాక్ సైన్యం కోసం, భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదంపై ఖర్చు చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అదే సమయంలో ఉగ్రవాదాన్ని పోషించే పాక్‌ను.. ఉగ్ర బాధిత దేశమైన భారత్‌తో పోల్చడం సరికాదన్నారు. అంతకుముందు, ఇదే అంశంపై కాంగ్రెస్ నేత పవన్ ఖేడా కూడా స్పందించారు. ఉగ్రవాద నిరోధక కమిటీకి పాకిస్థాన్ నాయకత్వం వహించడాన్ని ఆయన తప్పుపట్టారు. “జూన్ 4వ తేదీన తాలిబన్ ఆంక్షల కమిటీకి పాకిస్థాన్ వైస్ ఛైర్మన్‌గా ఎన్నికైంది. ఇది మన విదేశాంగ విధానంలో ఒక విషాదగాథ. అసలు ప్రపంచ దేశాలు దీనికి ఎలా అనుమతించాయి?” అని ఆయన సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.

Next Story