Russia-Ukraine: కాల్పుల విరమణకు సిద్ధమని ప్రకటించిన ఉక్రెయిన్, మిత్రదేశాలు

by S Gopi |   (  Updated:2025-05-10 15:26:16  IST  )

శాంతి చర్చలను మరింత బలోపేతం చేసేందుకు నాలుగు ప్రధాన యూరోపియన్ దేశాల నేతలు కైవ్‌కు చేరుకున్న తర్వాత ఈ ప్రకటన వెలువడింది.

Russia-Ukraine: కాల్పుల విరమణకు సిద్ధమని ప్రకటించిన ఉక్రెయిన్, మిత్రదేశాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: రష్యాతో బేషరతుగా 30 రోజుల కాల్పుల విరమణకు ఉక్రెయిన్‌తో పాటు దాని మిత్రదేశాలు సంసిద్ధతను వ్యక్తం చేశాయని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహా శనివారం ధృవీకరించారు. మే 12వ తేదీ నుంచి పూర్తిస్థాయిలో కాల్పుల విరమణకు ఆయా దేశాలు అంగీకరించాయి. సంఘర్షణను తగ్గించేందుకు దౌత్య ప్రయత్నాలు కొనసాగుతున్న వేళ శాంతి చర్చలను మరింత బలోపేతం చేసేందుకు నాలుగు ప్రధాన యూరోపియన్ దేశాల నేతలు కైవ్‌కు చేరుకున్న తర్వాత ఈ ప్రకటన వెలువడింది. దీనికి సంబంధించి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోస్ట్ చేసిన ఆండ్రీ సిబిహా, ఉక్రెయిన్, దాని మిత్రదేశాలు సోమవారం నుంచి కనీసం 30 రోజుల వరకు నేల, గాలి, సముద్రంలో పూర్తిగా కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నాయి. దీనికి రష్యా అంగీకరిస్తే, తదుపరి శాశ్వత కాల్పుల విరమణ, శాంతి చర్చలకు మార్గం సుగమం అవుతుందని పేర్కొన్నారు. కాగా, మార్చి నెలలో అమెరికా మొదటగా రష్యా, ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణకు ప్రతిపాదించింది. దీనికి ఉక్రెయిన్ అంగీకరించింది. కానీ, రష్యా నిబధనల ఆమోదించకుండా, తనకు ఆమోదయోగ్యమైన, ప్రయోజనకరమైన రీతిలో ఒప్పందం ఉండాలని కోరుకుంది.

Next Story