Delhi: ఢిల్లీలో యూకే మహిళపై అత్యాచారం

by S Gopi |

మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.

Delhi: ఢిల్లీలో యూకే మహిళపై అత్యాచారం
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలో దారుణ చోటుచేసుకుంది. స్నేహితుడని నమ్మి భారత్‌కు వచ్చిన ఓ విదేశీ మహిళపై ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు. అయితే, అక్కడితో ఆమె కష్టాల్లోంచి బయటపడలేదు, ఘటన తర్వాత సాయం కోసం వెళ్తున్న క్రమంలో హోటల్ లిఫ్ట్‌లో మరొకవ్యక్తి ఆమెను వేధించాడు. ఢిల్లీలోని మహిపాల్‌పుర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు వెల్లడించగా, మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. యూకేకు చెందిన బాధితురాలికి సోషల్ మీడియా ద్వారా ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. తరచూ మాట్లాడుకునేంత చనువు ఏర్పడటంతో ఇద్దరూ కలవాలని నిర్ణయించుకుని ఆమె భారత పర్యటనకు వచ్చింది. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉన్న మహిపాల్‌పుర్‌లోని ఒక హోటల్‌లో దిగిన ఆమెను కలిసేందుకు నిందితుడు అక్కడకు వచ్చాడు. అక్కడకు వచ్చిన తర్వాత అతని ప్రవర్తన ఆమెకు ఇబ్బందికరంగా మారడంతో అతనితో తీవ్ర వాగ్వాదానికి దిగింది. ఆ తర్వాత అతను తనపై అత్యాచారం చేశాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. అతడి నుంచి తప్పించుకుని హోటల్ రిసెప్షన్‌కు చేరుకున్న ఆమెకు సహాయం చేస్తాననే నెపంతో మరో వ్యక్తి హోటల్ లిఫ్ట్‌లో వేధింపులకు పాల్పడ్డాడని వివరించింది.

ఆమె ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అత్యాచారం, లైంగిక వేధింపుల ఆరోపణల కింద వారిద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. భారత పర్యటనకు వచ్చిన సమయంలో ఆమె మొదట మహారాష్ట్ర, గోవాల్లో పర్యటించింది. ఆ సమయంలో నిందితుడిని అక్కడకు వచ్చి కలవాలని కోరగా, తాను ఢిల్లీలో పనిచేస్తున్నానని, అక్కడికే రావాలని కోరాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి బ్రిటన్ హైకమిషన్‌కు వివరాలు పంపినట్టు సమాచారం. కాగా, ఇటీవల కర్ణాటకలోనూ ఇదే తరహా ఘటన చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. కొప్పళ జిల్లాలో ఇజ్రాయెల్‌కు చెందిన ఇద్దరు మహిళలపై ముగ్గురు నిందితులు అత్యాచారం చేశారు.

Next Story