ఆధార్ - మొబైల్ నంబర్ అప్డేట్‌పై UIDAI కీలక ప్రకటన

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-01-27 08:06:52  IST  )

ఆధార్ - మొబైల్ నంబర్ అప్డేట్ పై యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) కీలక ప్రకటన చేసింది.

ఆధార్ - మొబైల్ నంబర్ అప్డేట్‌పై UIDAI కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ఆధార్ - మొబైల్ నంబర్ అప్డేట్ పై యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) కీలక ప్రకటన చేసింది. త్వరలోనే ఏ ప్రదేశం నుంచైనా ఆధార్ - మొబైల్ నంబర్ ను అప్డేట్ చేసుకునేలా కొత్త వ్యవస్థను తీసుకురానున్నట్లు తెలిపింది. ఆధార్ సర్వీసులను మరింత ఈజీగా ఉపయోగించుకునేందుకే దీనిని అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. ఈ కొత్త సేవను 2026 జనవరి 28న అధికారికంగా ప్రారంభించనున్నట్లు UIDAI ప్రకటించింది. UIDAI డే వేడుకల సందర్భంగా ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. దీని ద్వారా కోట్లాది ఆధార్ వినియోగదారులకు మరింత సులభంగా సేవలు లభించనున్నాయి.

ఎక్కడైనా.. ఎప్పుడైనా

ఇప్పటి వరకు మొబైల్ నంబర్ మార్పు కోసం ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్లకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. కొత్త విధానంతో ఆ అవసరం తగ్గనుంది. ఆధార్ దారులు తమకు అనుకూలమైన సమయంలో, అనుకూలమైన చోట నుంచే మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే అవకాశం లభించనుంది. దీంతో ఓటీపీ ఆధారిత ధృవీకరణ, ఆధార్ ఆథెంటికేషన్, ప్రభుత్వ పథకాల లబ్ధి వంటి సేవల్లో ఎలాంటి అంతరాయం ఉండకుండా సులభంగా ఉపయోగించుకోవచ్చు.

డిజిటల్ సేవలకు మరింత ఊతం

ఆధార్‌కు సరైన మొబైల్ నంబర్ లింక్ అయి ఉండటం బ్యాంకింగ్, సబ్సిడీలు, ఆన్‌లైన్ ప్రభుత్వ సేవలకు ఎంతో కీలకం. ఈ కొత్త సౌకర్యం వల్ల భారత్‌లో డిజిటల్ వ్యవస్థ మరింత బలపడనుందని UIDAI భావిస్తోంది. ముఖ్యంగా వృద్ధులు, దూర ప్రాంతాల్లో నివసించే వారు, డిజిటల్ సేవలను ఎక్కువగా వినియోగించే వారికి ఇది ఎంతో ఉపయోగకరంగా మారనుంది.

ఆధార్ యాప్ కీలక పాత్ర

ఈ కొత్త సదుపాయం అమలులో ఆధార్ మొబైల్ యాప్ కీలక పాత్ర పోషించనుంది. గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉన్న ఆధార్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని UIDAI సూచిస్తోంది. ఈ యాప్ ద్వారా భద్రంగా, సులభంగా ఆధార్‌కు సంబంధించిన సేవలను పొందవచ్చు.

డిజిటల్ ఇండియాకు మరో అడుగు

ఈ కొత్త మొబైల్ అప్‌డేట్ సౌకర్యంతో ఆధార్ సేవలు మరింత సమగ్రంగా, ప్రజలకనుగుణంగా మారనున్నాయి. పౌరులకు డిజిటల్ సేవలు మరింత సులభంగా అందించాలన్న UIDAI లక్ష్యంలో ఇది మరో కీలక అడుగుగా భావిస్తున్నారు.

Next Story