Aadhaar Cleanup: 2 కోట్లకు పైగా ఆధార్ ఐడీలను డియాక్టివేట్ చేసిన UIDAI

by Naga Rani Yarlagadda |

యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) రెండు కోట్లకు పైగా ఆధార్ ఐడీలను డియాక్టివేట్ చేసింది.

Aadhaar Cleanup: 2 కోట్లకు పైగా ఆధార్ ఐడీలను డియాక్టివేట్ చేసిన UIDAI
X

దిశ, వెబ్‌డెస్క్: యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) రెండు కోట్లకు పైగా ఆధార్ ఐడీలను డియాక్టివేట్ చేసింది. దేశవ్యాప్తంగా చేపట్టిన డేటాబేస్ క్లీన్ అప్ లో భాగంగా మరణించిన వ్యక్తులకు సంబంధించిన ఆధార్ నంబర్లను డియాక్టివేట్ చేసినట్లు ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. UIDAI రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (RGI), రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ ప్రక్షాళన చేపట్టినట్లు తెలిపింది. ప్రభుత్వంచే ధృవీకరించబడిన మరణించిన వారి డేటా ప్రకారం ఆధార్ నంబర్లను తొలగించినట్లు స్పష్టం చేసింది. తొలగించిన ఆధార్ నంబర్లను మరొకరికి కేటాయించబోమని UIDAI పేర్కొంది. ఇది మోసాలను అరికట్టేందుకు, ఫేక్ ఆధార్ లను నియంత్రించేందుకు తోడ్పడుతుందన్నారు.

సంక్షేమ ప్రయోజనాలు పొందేందుకు వ్యక్తి మరణించిన తర్వాత కూడా ఆధార్ ను అనధికారికంగా ఉపయోగించడాన్ని కూడా నిరోధించేందుకు ఆధార్ డీయాక్టివేషన్ చాలా అవసరమని UIDAI పేర్కొంది. దీనిని మరింత సింప్లిఫై చేసేందుకు 2025 ప్రారంభంలో UIDAI 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ద్వారా నమోదయిన మరణాల కోసం myAadhaar పోర్టల్ లో కుటుంబ సభ్యుడి డెత్ సర్టిఫికేట్ సేవను ప్రారంభించింది. మిగతా ప్రాంతాల్లోనూ దీనిని అమలు చేసే ప్రక్రియ జరుగుతోంది. దీని ద్వారా UIDAI ఆధార్ డీయాక్టివేషన్ చేసేముందు వారు ఇచ్చిన సమాచారాన్ని ధృవీకరిస్తుంది. రిజిస్ట్రేషన్ అధికారుల నుంచి అధికారిక మరణ ధృవీకరణ పత్రాన్ని పొందాక.. ఆధార్ హోల్డర్లు, మరణించిన కుటుంబ సభ్యుల వివరాలను పోర్టల్ లో నమోదు చేయాలని Meity తెలిపింది. భవిష్యత్తులో ఆధార్ ద్వారా ధృవీకరించిన మరణించినవారి డేటాను పంచుకునేందుకు బ్యాంకులు, ఇతర సంస్థలతో కలిసి పనిచేయాలని UIDAI యోచిస్తోంది.

Next Story