Ugc: 18 వైద్య కళాశాలలకు యూజీసీ షోకాజ్ నోటీసులు.. కారణమిదే?

by vinod kumar |
Ugc: 18 వైద్య కళాశాలలకు యూజీసీ షోకాజ్ నోటీసులు.. కారణమిదే?
X

దిశ, నేషనల్ బ్యూరో: యాంటీ ర్యాగింగ్ (Anti Ragging) నిబంధనలను పాటించలేదనే ఆరోపణలతో దేశ వ్యాప్తంగా 18 వైద్య కళాశాలలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (Ugc) గురువారం షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు అధికారులు తెలిపారు. వీటిలో ఢిల్లీ, తమిళనాడు, అసోం, పుదుచ్చేరిలలో రెండు చొప్పున కాలేజీలు ఉండగా, ఆంద్రప్రదేశ్, బిహార్‌లలో మూడు, మధ్యప్రదేశ్, తెలంగాణ(Telangana), పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్‌లలో ఒక్కొక్కటి ఉన్నాయి. ర్యాగింగ్‌ని అరికట్టడానికి 2009 యాంటీ ర్యాగింగ్ రూల్స్‌లో నిర్దేశించిన తప్పనిసరి అవసరాలను ఈ కళాశాలలు పాటించలేదని వెల్లడించారు. యాంటీ ర్యాగింగ్ నిబంధనల ప్రకారం విద్యార్థులకు సూచనలివ్వడంలో ఈ కళాశాలలు విఫలమయ్యాయని యూజీసీ కార్యదర్శి మనీష్ జోషి (Manish joshi) తెలిపారు.

యాంటీ ర్యాగింగ్ రూల్స్ (Anti ragging rules) 2009 ప్రకారం.. విద్యార్థి, వారి తల్లిదండ్రులు కళాశాలలో అడ్మిషన్ తీసుకునే సమయంలో, ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలో ర్యాగింగ్ నిరోధక ఒప్పందాన్ని సమర్పించాలని స్పష్టం చేశారు. కానీ ఈ విద్యా సంస్థలు పాటించలేదని తెలిపారు. దీని వల్ల విద్యార్థుల భద్రత ప్రమాదంలో పడే అవకాశం ఉందన్నారు. అందుకే నోటీసులు జారీ చేశామని స్పష్టం చేశారు. నోటీసు అందిన తేదీ నుంచి ఏడు రోజుల్లోపు కళాశాలలను ఈ లోపానికి గల కారణలపై లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశించారు. నిర్ణీత గడువులోపు సంతృప్తికరమైన వివరణ ఇవ్వడంతో మెడికల్ కాలేజీలు విఫలమైతే యాంటీ ర్యాగింగ్ రూల్స్ 2009 ప్రకారం ఆయ కళాశాలపై జరిమానాలతో పాటు ఇతర చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Next Story