అయ్యో.. నేను అలా అనలేదు : సనాతన ధర్మం నిర్మూలన వ్యాఖ్యలపై ఉదయనిధి వివరణ

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-05-15 09:38:33  IST  )

అయ్యో.. నేను అలా అనలేదు : సనాతన ధర్మం నిర్మూలన వ్యాఖ్యలపై ఉదయనిధి వివరణ
X

దిశ, వెబ్‌డెస్క్: డీఎంకే శాసన సభాపక్ష నేత ఉదయనిధి స్టాలిన్.. సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు మళ్లీ దుమారాన్ని రేపుతున్నాయి. ఈ వివాదంపై ఉదయనిధి స్టాలిన్ స్పందించారు. ప్రజలను కులాలుగా విభజించే వ్యవస్థకు మాత్రమే తాను వ్యతిరేకమని, దేవాలయాల్లోకి వెళ్లొద్దని తన వ్యాఖ్యల ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. కులవ్యవస్థను నిర్మూలించడమంటే ఆలయాల్లోకి వెళ్లొద్దని అర్థం కాదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. సమాజంలో ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు ఉండాలనేదే తన ఉద్దేశ్యమన్నారు.

గతంలో తమిళనాడు అసెంబ్లీలో తాను మాట్లాడినపుడు.. ప్రజలను విభజించే కులవ్యవస్థను అంతమొందించాలని మాత్రమే అన్నానని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలను ఆధారంగా చేసుకుని తనపై విమర్శలు చేస్తున్నారని, దేనికీ తాను భయపడే వ్యక్తిని కానన్నారు. ద్రవిడ ఉద్యమం పుట్టిందే ప్రతిఘటన నుంచి అని.. ఆ కోణంలోనే చిన్న వివరణ ఇస్తున్నానని పోస్టులో పేర్కొన్నారు. ప్రజల్ని అగ్రకులాలు, తక్కువ కులాలుగా విభజించి చూసే వ్యవస్థను అంతమొందించాలని తాను కోరుకుంటున్నట్లు ఆ పోస్టులో రాసుకొచ్చారు. పెరియార్, అంబేద్కర్, అన్నాదురై, కరుణానిధి బోధించిన సిద్ధాంతాల గురించే మాట్లాడినట్లు చెప్పుకొచ్చారు. దేవుడిపై ఎవరి నమ్మకాలకూ తాము వ్యతిరేకం కాదని, అసమానతలు, అణచివేతను మాత్రం సహించబోమని పేర్కొన్నాదు. కాగా.. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా తన తొలి ప్రసంగంలో.. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని ఉదయనిధి స్టాలిన్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

Next Story