మాజీ CM ‘లాయల్టీ టెస్ట్’ ఫ్లాప్.. ఆరుగురు ఎంపీలు డుమ్మా!

by Gantepaka Srikanth |   (  Updated:2026-06-18 07:39:05  IST  )

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన పార్టీలో తీవ్ర తిరుగుబాటు ప్రకంపనలు రేగుతున్నాయి.

మాజీ CM ‘లాయల్టీ టెస్ట్’ ఫ్లాప్.. ఆరుగురు ఎంపీలు డుమ్మా!
X

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన పార్టీలో తీవ్ర తిరుగుబాటు ప్రకంపనలు రేగుతున్నాయి. గురువారం ఢిల్లీలో జరిగిన పార్టీ అత్యవసర పార్లమెంటరీ భేటీకి మొత్తం 9 మంది లోక్‌సభ ఎంపీలలో కేవలం ముగ్గురు మాత్రమే హాజరుకావడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. పార్టీ ఎంపీలంతా తప్పనిసరిగా హాజరుకావాలంటూ 'త్రీ లైన్ విప్' జారీ చేసినప్పటికీ ఆరుగురు ఎంపీలు గైర్హాజరు కావడం చూస్తుంటే.. ఉద్ధవ్ క్యాంప్‌లో మరో భారీ చీలిక ఖాయమనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి. ఈ ఆరుగురు ఎంపీలు త్వరలోనే మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గంలో చేరడానికి సిద్ధమవుతున్నట్లు గట్టిగా ప్రచారం జరుగుతోంది.

హాజరు అయిన వారు..

1. అరవింద్ సావంత్

2. అనిల్ దేశాయ్

3. రాజాభౌ వాజే

4. సంజయ్ రౌత్ (రాజ్యసభ)

హాజరుకాని ఆరుగురు..

1. సంజయ్ దేశముఖ్

2. సంజయ్ జాదవ్

3. నాగేష్ పాటిల్-అష్టికర్

4. భౌసాహెబ్ వాక్‌చౌరే

5. ఓంరాజే నింబాల్కర్

6. సంజయ్ దినా పాటిల్

రానివాళ్లంతా ద్రోహులే..

సమావేశానికి హాజరయ్యే ముందు రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ గైర్హాజరైన ఎంపీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "సమావేశానికి వచ్చినవారే మావాళ్లు, రానివాళ్లంతా ద్రోహులు, నిజాయితీ లేనివాళ్లు" అని మండిపడ్డారు. అలాగే పార్టీని చీల్చాలని చూస్తున్న శక్తులకు హెచ్చరికలు జారీ చేశారు. ఒక్కసారి పార్టీని చీల్చాం కదా అని మళ్లీ చేయేగలమని అనుకుంటున్నారు. దమ్ముంటే నిరూపించండి. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారా? మీ దగ్గర బాగా డబ్బుందా? ఈడీ, సీబీఐల పేరుతో మమ్మల్ని బెదిరిస్తున్నారా? మేము ఇప్పటికీ జైలుకు వెళ్లొచ్చాం, అవసరమైతే మళ్లీ వెళ్ళడానికైనా సిద్ధం. కానీ మీకు తగిన బుద్ధి చెప్పిన తర్వాతే జైలుకు వెళ్తాను" అంటూ రౌత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

స్పీకర్‌ను ఆశ్రయించిన తిరుగుబాటు ఎంపీలు..

ఈ అత్యవసర సమావేశానికి ఒక రోజు ముందే.. అసమ్మతి ఎంపీల బృందం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసినట్లు నివేదికలు వచ్చాయి. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం అనర్హత వేటు పడకుండా ఉండటానికి కనీసం మూడంట రెండొంతుల (2/3) మంది ప్రజాప్రతినిధుల మద్దతు అవసరం. శివసేన (UBT)కి ఉన్న 9 మంది లోక్‌సభ సభ్యులలో 6 గురు ఎంపీల మద్దతు తమకు ఉందని, తమను ప్రత్యేక గ్రూపుగా గుర్తించాలని ఈ తిరుగుబాటు వర్గం స్పీకరు ' కోరినట్లు సమాచారం. గురువారం నాటి సమావేశానికి కచ్చితంగా ఆరుగురు ఎంపీలు దూరంగా ఉండటంతో.. రెబల్స్ చెప్తున్న లెక్కలు నిజమేనన్న అనుమానాలు బలపడుతున్నాయి.

Next Story