మోడీతో 2 గంటల మీటింగ్.. 6 గంటల జర్నీ చేసిన యూఏఈ ప్రెసిడెంట్

by Phanindra |

మోడీతో 2 గంటల మీటింగ్ కోసం యూఏఈ ప్రెరసిడెంట్ ఏకంగా 6 గంటల జర్నీ చేశారు.

మోడీతో 2 గంటల మీటింగ్.. 6 గంటల జర్నీ చేసిన యూఏఈ ప్రెసిడెంట్
X

దిశ, నేషనల్ బ్యూరో: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మహమద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. కేవలం 2 గంటల సమావేశం కోసం భారత్ వచ్చిన యూఏఈ అధ్యక్షుడితో ఈ సమయంలోనే పలు కీలక ఒప్పందాలు చేసుకున్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. సోమవారం నాడు పాలంలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో ల్యాండయిన యూఏఈ ప్రెసిడెంట్‌ను ప్రధాని మోడీ సాదరంగా ఆహ్వానించారు. స్వయంగా వెళ్లి కౌగిలించుకొని స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరు నేతలు ఒకే కారులో ప్రధాని అధికారక నివాసం ‘లోక్ కల్యాణ్ మార్గ్’కు వెళ్లారు. ఈ నేతలిద్దరి మధ్య ఎంతో మంచి స్నేహం ఉందన్న విదేశాంగ సెక్రెటరీ విక్రమ్ మిస్రీ.. ఇరువురూ కూడా ఎన్నో విషయాలపై చర్చలు జరిపినట్లు వెల్లడించారు. ఇదే సమయంలో న్యూక్లియర్ రియాక్టర్లు, ఏఐ, డిఫెన్స్, ఎనర్జీ సెక్యూరిటీ, కౌంటర్ టెర్రరిజం వంటి అంశాల్లో కీలక ఒప్పందాలు కూడా చేసుకున్నట్లు మిస్రీ వివరించారు. ఈ పర్యటనలో అల్-నహ్యాన్ వెంట దుబాయ్ యువరాజ్, యూఏఈ రక్షణ మంత్రి, డిప్యూటీ పీఎం అయిన షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ మక్తూమ్, అబుధాబి, దుబాయ్ రాజకుటుంబీకులు, కీలక మంత్రులు ఉన్నారు.

కీలక ఒప్పందాలు..

ప్రధాని మోడీ, అల్ నహ్యాన్ భేటీలో పదేళ్ల పాటు భారత్‌కు యూఏఈ నుంచి ఎల్‌ఎన్‌జీ సరఫరా చేసేలా ఒప్పందం చేసుకున్నారు. 2028 నుంచి ఏటా 5 లక్షల టన్నుల లిక్విడ్ సహజవాయువును యూఏఈ అందించేలా హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, ఏడీఎన్‌ఓసీ గ్యాస్ మధ్య డీల్ కుదిరింది. అలాగే భారీ న్యూక్లియర్ రియాక్టర్లు, చిన్న మాడ్యులర్ రియాక్టర్లు అభివృద్ధి చేయడంలో కూడా సహకరించుకునేలా ఒప్పందం చేసుకున్నాయీ దేశాలు. ఏఐతోపాటు వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీలో పెట్టుబడులు పెట్టాలని, భారత్‌లో సూపర్ కంప్యూటింగ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో సార్వభౌమత్వాన్ని గుర్తిస్తూ ‘డిజిటల్ ఎంబసీలు’ ఏర్పాటు చేసే అవకాశాలను ఇరుదేశాలు పరిశీలించనున్నాయి. వ్యూహాత్మక డిఫెన్స్ భాగస్వామ్యం కోసం పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు లెటర్ ఆఫ్ ఇంటెట్‌పై సంతకాలు చేశాయి. ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండించిన రెండు దేశాల నేతలు.. క్రాస్-బోర్డర్ టెర్రరిజం, దానికి మద్దతిచ్చే వారు, ఆర్థిక సాయం అందించే వారిని కూడా శిక్షించాలని తీర్మానించాయి.

2022లో కాంప్రెహెన్సివ్ ఎకనామిక్ పార్టనర్‌షిప్ అగ్రిమెంట్ కుదిరిన తర్వాత 2024-25లో భారత్-యూఏఈ మధ్య 100 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగింది. 2032 నాటికి దీన్ని 200 బిలియన్ డాలర్లకు పెంచాలని ఇరుదేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. గుజరాత్‌లోని ధోలెరాలో స్పెషల్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేందుకు యూఏఈ ఆసక్తిచూపింది. అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులు, గ్రీన్‌ఫీల్డ్ పోర్టు, ఎనర్జీ సదుపాయాలు, స్మార్ట్ అర్బన్ టౌన్‌‌షిప్ తదితరాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రతిపాదనలు వచ్చాయి. స్పేస్ రంగంలో కూడా సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు ఇరుదేశాలు అంగీకరించాయి. లాంచ్ సదుపాయాలు, శాటిలైట్ ఫ్యాబ్రికేషన్ సహా స్పేస్ సైన్స్, టెక్నాలజీని కమర్షియలైజ్ చేయడంపై కలిసి పనిచేసేందుకు ఆసక్తి కనబరిచాయి. ఆహార భద్రత, వ్యవసాయ రంగంలో కూడా కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. దీనిపై ఎంవోయూపై సంతకాలు కూడా చేశాయి.

2 గంటల మీటింగ్.. 6 గంటల ప్రయాణం

యూఏఈ నుంచి ఢిల్లీకి ప్రయాణం చేయాలంటే 3 గంటలు పడుతుంది. వెళ్లాలన్నా అంతే.. భారత్‌లో అల్ నహ్యాన్ కేవలం గంటా 45 నిమిషాలు మాత్రమే ఉన్నారు. వేరే దేశానికి వెళ్తూ మధ్యలో భారత్‌కు రాలేదు. నేరుగా వచ్చి ఒప్పందాలు చేసుకొని వెళ్లిపోయారు. అంటే సుమారు 2 గంటల మీటింగ్ కోసం ఆరు గంటలు ప్రయాణించారన్నమాట.

Next Story