బుల్లెట్ తగిలినా వెనక్కి తగ్గని 'టైసన్'.. ఉగ్రవేటలో మూగజీవి సాహసం

by Kema Shiva Kumar |

జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్‌లో జరిగిన ‘ఆపరేషన్ ట్రాషి-1’ ఆపరేషన్‌లో భారత సైన్యానికి చెందిన ‘టైసన్’ అనే జాగిలం చేసి సాహసం అందరిని ఔరా.. అనేలా చేసింది.

బుల్లెట్ తగిలినా వెనక్కి తగ్గని టైసన్.. ఉగ్రవేటలో మూగజీవి సాహసం
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ రక్షణలో కేవలం యూనిఫాం వేసిన సైనికులే కాదు, కఠిన శిక్షణ పొందిన జాగిలాలు కూడా ప్రాణాలకు తెగించి పోరాడుతున్నాయి. తాజాగా సోమవారం జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో జరిగిన ‘ఆపరేషన్ ట్రాషి-1’లో టైసన్ (Tyson) అనే జాగిలం అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించి ముగ్గురు ఉగ్రవాదుల ఏరివేతలో కీలక పాత్ర పోషించింది. కిష్త్వార్‌ (Kishtwar)లోని ఛత్రూ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నారన్న సమాచారంతో భారత సైన్యం, పోలీసులు, సీఆర్పీఎఫ్ సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదుల స్థావరాన్ని గుర్తించడానికి సైన్యం ‘టైసన్’ను ముందు పంపింది.

గుండు తగిలినా ఆగని వేట..

టైసన్ లోపలికి వెళ్లడాన్ని గమనించిన ఉగ్రవాదులు దానిపైకి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో టైసన్ కాలికి తుపాకీ గుండు (Bullet) తగిలి తీవ్ర గాయమైంది. అయినప్పటికీ, టైసన్ ఏమాత్రం భయపడకుండా తన పనిని కొనసాగించింది. అది ఉగ్రవాదులను గట్టిగా కనిపెట్టడంతో, సైనిక బృందం వెంటనే అక్కడికి చేరుకుని ముగ్గురు జైషే మహ్మద్ (Jaish-E-Mohammed) ఉగ్రవాదులను హతమార్చింది. సుమారు ఒకటిన్నర ఏళ్ల క్రితం భారత్‌లోకి చొరబడిన ఏడుగురు కరుడుగట్టిన ఉగ్రవాదుల ముఠాను పూర్తిగా తుడిచిపెట్టడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ సాగింది. నిన్నటితో ఈ ముఠాలోని ఆఖరి ఉగ్రవాదులను కూడా మట్టుబెట్టడంతో ఈ మెగా ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది.

కోలుకుంటున్న టైసన్..

అయితే ఉగ్రవాదుల కాల్పుల్లో గాయపడిన టైసన్‌ను వెంటనే హెలికాప్టర్ ద్వారా ఉధంపూర్‌ (Udhampur)లోని వెటర్నరీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం టైసన్ క్షేమంగా ఉందని, చికిత్సకు స్పందిస్తోందని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఆపరేషన్‌లో మన సైనికులకు ఎటువంటి గాయాలు కాకుండా, కేవలం టైసన్ మాత్రమే గాయపడి పెద్ద ముప్పును తప్పించిందని మేజర్ జనరల్ ఏపీఎస్ బాల్ ప్రశంసించారు.

Next Story