రైలు రాకను లెక్కచేయని నిర్లక్ష్యం..! ఇద్దరు మహిళల ప్రాణాలు కోల్పోయిన ఘటన వైరల్

by Ramesh Naini |   (  Updated:2026-05-05 14:48:42  IST  )

సమయం ఆదా చేసుకోవాలనే తొందర ఇద్దరు మహిళల ప్రాణాలను బలితీసుకుంది.

రైలు రాకను లెక్కచేయని నిర్లక్ష్యం..! ఇద్దరు మహిళల ప్రాణాలు కోల్పోయిన ఘటన వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: సమయం ఆదా చేసుకోవాలనే తొందర ఇద్దరు మహిళల ప్రాణాలను బలితీసుకుంది. రైలు పట్టాలు దాటుతున్న ఒక మహిళ, ఆమె మేనకోడలిని వేగంగా దూసుకొచ్చిన ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టడంతో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన బీహార్‌లోని పాట్నా పరిధిలో ఉన్న బఖ్తియార్‌పూర్ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మే 4, సోమవారం మధ్యాహ్నం 2:24 గంటల సమయంలో బఖ్తియార్‌పూర్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాం నంబర్ 1 వద్ద ఈ దుర్ఘటన జరిగింది. గయాలోని మాన్‌పూర్‌కు చెందిన ఇంటార్ దేవి (62).. రామ్‌నగర్ దియారా అత్మాల్‌గోలాకు చెందిన తన మేనకోడలు సంగీతా దేవి (45)ని రైలు ఎక్కించేందుకు స్టేషన్‌కు వచ్చారు. కాలిబాటన పట్టాలు దాటి ప్లాట్‌ఫాంపైకి ఎక్కేందుకు వారు ప్రయత్నించారు. అదే సమయంలో సిగ్నల్ క్లియరెన్స్ ఉండటంతో న్యూఢిల్లీ-మాల్డా ఎక్స్‌ప్రెస్ (ఫరక్కా ఎక్స్‌ప్రెస్ - 14004) వేగంగా స్టేషన్ గుండా దూసుకొచ్చింది. రైలు రాకను గమనించిన ప్రయాణికులు, ప్రత్యక్ష సాక్షులు గట్టిగా అరుస్తూ హెచ్చరించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. క్షణాల్లోనే ఆ మహిళలు ప్లాట్‌ఫాం, కదులుతున్న రైలు మధ్య ఇరుక్కుపోయారు. ప్రయాణికులు వారిని రక్షించేందుకు విఫలయత్నం చేశారు. ఇద్దరూ రైలు కింద పడి దారుణంగా మృతి చెందడంతో స్టేషన్‌లో ఒక్కసారిగా భయానక వాతావరణం, గందరగోళం నెలకొంది.

సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు..

ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించిన దృశ్యాలన్నీ స్టేషన్‌లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), గవర్నమెంట్ రైల్వే పోలీస్ (GRP) సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాధితుల బంధువులకు సమాచారం అందించామని, తదుపరి చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని ఆర్పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ జవహర్ లాల్ ధృవీకరించారు. ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. నిర్లక్ష్యమే వారి ప్రాణాలను బలితీసుకుందని, రైలు పోయేంత వరకు కనీసం పట్టాలు దాటకుండా ఉండొచ్చు కదా? అని నెటిజన్‌లు ఆందోళన వ్యక్తం చేశారు.

Next Story