- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జైల్లో చిగురించిన ప్రేమ.. పెళ్లికి ఎమర్జెన్సీ పెరోల్.. వాళ్ల నేరచరిత్ర తెలిస్తే అవాక్కవ్వాల్సిందే
వాళ్లిద్దరూ హత్యకేసుల్లో దోషులు. ఆమె డేటింగ్ యాప్ లో పరిచయమైన వ్యక్తిని హత్యచేసి జైలుకెళ్లింది. అతను ఏకంగా ఐదుగురిని చంపి శిక్ష అనుభవిస్తున్నాడు.

దిశ, వెబ్‌డెస్క్: వాళ్లిద్దరూ హత్యకేసుల్లో దోషులు. ఆమె డేటింగ్ యాప్ లో పరిచయమైన వ్యక్తిని హత్యచేసి జైలుకెళ్లింది. అతను ఏకంగా ఐదుగురిని చంపి శిక్ష అనుభవిస్తున్నాడు. వీరిద్దరి మధ్య జైల్లోనే ప్రేమ చిగురించింది. అది పెళ్లికి దారితీసింది. ఇంకేముంది పెళ్లి చేసుకునేందుకు పెరోల్ ఇవ్వాలని కోర్టును ఆశ్రయించారు. వారి పెరోల్ పిటిషన్ ను పరిశీలించిన రాజస్థాన్ హైకోర్టు ఎమర్జెన్సీ పెరోల్ మంజూరు చేసింది. ప్రియాసేథ్ అలియాస్ నేహా సేథ్ - హనుమాన్ ప్రసాద్ నేడు అల్వార్ జిల్లా బరోడామేవ్ లో పెళ్లి చేసుకోనున్నారు. ఖైదీల మధ్య చిగురించిన ప్రేమ పెళ్లికి దారితీయడం, అందుకు కోర్టు ఎమర్జెన్సీ పెరోల్ ఇవ్వడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ప్రియా సేథ్ అలియాస్ నేహా సేథ్ వృత్తిరీత్యా మోడల్. ఆమెకు టిండర్ అనే డేటింగ్ యాప్ ద్వారా 2018లో దుష్యంత్ శర్మ అనే యువకుడు పరిచయం అయ్యాడు. అతడిని తన ప్రేమలోకి దింపి, ఆపై కిడ్నాప్ చేసి, డబ్బులు వసూలు చేసి అప్పట్లో తన ప్రియుడైన దిక్షాంత్ కాంబ్రా అప్పుల్ని తీర్చాలని ప్లాన్ చేసింది. ప్లాన్ ప్రకారం.. దుష్యంత్ తో పరిచయం పెంచుకున్న ప్రియ అతడిని 2018 మే2న బజాజ్ నగర్లో ఉన్న తన ఫ్లాట్ కు పిలిచింది. ఆ తర్వాత అతడి తండ్రికి ఫోన్ చేసి రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఆయన రూ.3 లక్షలు పంపాడు. దుష్యంత్ ను వదిలేస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తాడన్న భయంతో ప్రియ, దిక్షాంత్, మరో స్నేహితుడు లక్ష్య వాలియాతో కలిసి కత్తితో పొడిచి హతమార్చారు. ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు ముఖంపై కత్తితో గాయాలు చేసి, డెడ్ బాడీని సూట్ కేసులో పెట్టి ఆమర్ కొండల్లో పడేశారు. ఆపై ఫ్లాట్ లో ఆధారాలను తొలగించారు. మే3వ తేదీ రాత్రి డెడ్ బాడీ పోలీసులకు దొరకగా.. డాగ్ స్క్వాడ్, ఇతర ఆధారాలతో ఆ ముగ్గురినీ అరెస్ట్ చేశారు. ఈ కేసులో నేరనిర్థారణ కావడంతో ప్రియాసేథ్ జైలుశిక్ష అనువిస్తోంది.
ఐదుగురిని హత్య చేసిన హనుమాన్ ప్రసాద్
హనుమాన్ ప్రసాద్ తన ప్రేయసి భర్త, పిల్లలను హత్య చేసిన కేసులో శిక్ష అనుభవిస్తున్నాడు. అతని ప్రేయసి సంతోష్ ఆల్వర్ తైక్వాండో క్రీడాకారిణి. అతనికంటే 10 ఏళ్లు పెద్దది. 2017 అక్టోబర్ 2 రాత్రి, సంతోష్ తన భర్త, పిల్లలను హత్య చేయాలని ప్రసాద్‌ను ఇంటికి పిలిచింది. అతడు మరో వ్యక్తితో కలిసి వెళ్లి, జంతువులను కోసే కత్తితో ఆమె భర్త బన్వారీ లాల్‌ను హత్య చేశాడు. ఈ హత్యను చూసిన సంతోష్ ముగ్గురు పిల్లలు, ఆమె సోదరి కుమారుడు భయంతో కేకలు వేయడంతో, సాక్షులు మిగలకూడదని సంతోష్ వారినీ హత్య చేయమని ఆదేశించింది. ఆ రాత్రి నలుగురు పిల్లలు, ఒక వ్యక్తి దారుణంగా హతమయ్యారు. ప్రస్తుతం ప్రియా సేథ్, హనుమాన్ ప్రసాద్ లు జీవితఖైదు శిక్ష అనుభవిస్తున్నారు. ఇంతటి ఘోరమైన నేరచరిత్ర ఉన్న ఇద్దరు ప్రేమలో పడటం, పెళ్లిచేసుకోవడం దేశవ్యాప్తంగా తీవ్రచర్చకు దారితీసింది.






