- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Myanmar: మయన్మార్ లో వరుస భూకంపాలు.. 20 మంది మృతి
మయన్మార్‌లో వరుసగా రెండుసార్లు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 7.7, 6.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. బ్యాంకాక్‌లోనూ భూ ప్రకంపనలు సంభవించాయి.

దిశ, నేషనల్ బ్యూరో: మయన్మార్‌లో వరుసగా రెండుసార్లు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 7.7, 6.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ప్రమాదంలో 20 మంది చనిపోగా.. పలువురికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మయన్మార్‌లోని మండలేలోని ఐకానిక్ అవా వంతెన ఇరావడీ నదిలోకి కూలిపోయిందని అధికారులు తెలిపారు. భారీ భూకంపాల ధాటికి అనేక భవనాలు కూలిపోయాయి. ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. తమ ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. సెంట్రల్ మయన్మార్ (Myanmar)లోని మోనివా నగరానికి తూర్పున 50 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే గుర్తించింది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలకు బ్యాంకాక్ (Bangkok)లో ప్రకంపనలు సంభవించాయి. పలు భవనాల్లో అలారమ్ మోగడంతో ప్రజలు బయటకు పరుగులు తీశారు. ప్రకంపనల ధాటికి అనేక భవనాలు నేలమట్టం అయ్యాయి. పలు బిల్డింగులు ఊగిపోయాయి. దీనికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే, ఓ భవనం కింద 43 మంది కార్మికులు చిక్కుకున్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి.
నేలమట్టం అయిన భవనాలు
మరోవైపు, భూకంపాల ప్రభావం ఎంతగా ఉందంటే.. దాదాపు 900 కి.మీ దూరంలో ఉన్న బ్యాంకాక్‌ను భూకంపాలు కుదిపేశాయి. బ్యాంకాక్‌లో ఓ భవనం కూలిపోవడంతో ఇద్దరు మృతిచెందగా.. ఏడుగురిని కాపాడినట్లు ఎమర్జెన్సీ రెస్పాండర్ మీడియాకు తెలిపారు. బ్యాంకాక్‌లో మెట్రో, రైలు సేవలను నిలిపివేశారు. ఈ పరిస్థితుల దృష్ట్యా థాయ్‌లాండ్‌లో ప్రధాని షినవత్ర అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అంతేకాకుండా, ఈ భూకంప ప్రభావం ఆగ్నేయాసియా దేశాలపైనా కన్పించింది. భారత్‌లోని కోల్‌కతా, ఇంఫాల్, మేఘాలయలో స్వల్పంగా ప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. మేఘాలయ ఈస్ట్‌గారో హిల్స్‌లో 4 తీవ్రతతో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. బంగ్లాదేశ్‌లోనూ 7.3 తీవ్రతతో భూమి కంపించినట్లు తెలుస్తోంది.






