ఉత్తర్‌ప్రదేశ్‌‌లోని ఓ కోచింగ్ సెంటర్‌లో బ్లాస్ట్.. ఇద్దరు మృతి.. ఏడుగురికి గాయాలు

by Ramesh Naini |

ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌లోని ఓ కోచింగ్ సెంటర్‌లో శనివారం జరిగిన పేలుడులో ఇద్దరు మృతి చెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు.

ఉత్తర్‌ప్రదేశ్‌‌లోని ఓ కోచింగ్ సెంటర్‌లో బ్లాస్ట్.. ఇద్దరు మృతి.. ఏడుగురికి గాయాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌లోని ఓ కోచింగ్ సెంటర్‌లో శనివారం జరిగిన పేలుడులో ఇద్దరు మృతి చెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉన్న లైబ్రరీలో పేలుడుతో ఈ దారుణం చోటు చేసుకుంది. కోచింగ్ సెంటర్ బేస్‌మెంట్‌లో ఉన్న సెప్టిక్ ట్యాంక్‌లో అధిక గాఢత కలిగిన మీథేన్ కారణంగా పేలుడు సంభవించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు, అగ్నిమాపక, రెస్క్యూ సిబ్బంది సంఘటనా స్థలంలో ఉండి పేలుడుపై దర్యాప్తు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి వెంటనే వైద్య సహాయం అందించాలని, సహాయక చర్యలు స్పీడప్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఆ పేలుడు దురదృష్టకర ఘటనగా అభివర్ణిస్తూ బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కద్రి గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కోచింగ్ సెంటర‌లో పేలుడుపై మాకు సమాచారం అందిందని ఫరూఖాబాద్ ఎస్పీ ఆర్తి సింగ్ మీడియాతో మాట్లాడారు. ఫీల్డ్ యూనిట్, అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారని తెలిపారు. కోచింగ్ సెంటర్ బేస్ మెంట్‌లో ఉన్న సెప్టిక్ ట్యాంక్ అధిక గాఢత కలిగిన మీథేన్ వాయువు కారణంగా పేలుడు సంభవించి ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోవైపు ఆ ప్రాంతంలో ఒక స్విచ్ బోర్డు కూడా గుర్తించినట్లు తెలిపారు. బహుశా దాని వల్లే పేలుడు జరిగి ఉండవచ్చని అంచనా వేశారు. గాయపడిన వారు చికిత్స పొందుతున్నారని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.

Next Story