- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థినిపై హత్యాచార కేసులో రెండు మరణశిక్షలు.. 77 రోజుల్లోనే పోక్సో కోర్టు సంచలన తీర్పు
తమిళనాడులోని తూత్తుకుడి (Tuticorin) జిల్లాలో 12వ తరగతి విద్యార్థినిపై జరిగిన హత్యాచార కేసులో స్థానిక పోక్సో (POCSO) కోర్టు కీలక తీర్పు వెలువరించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: తమిళనాడులోని తూత్తుకుడి (Tuticorin) జిల్లాలో 12వ తరగతి విద్యార్థినిపై జరిగిన హత్యాచార కేసులో స్థానిక పోక్సో (POCSO) కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ దారుణానికి ఒడిగట్టిన దోషికి రెండు మరణశిక్షలు విధిస్తూ సోమవారం ఉరిశిక్ష ఖరారు చేసింది. నేరం జరిగిన 77 రోజుల్లోనే విచారణ పూర్తి చేసి ఈ తీర్పు ఇవ్వడం గమనార్హం. కేసు వివరాల్లోకి వెళితే.. విలాతికులం ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల విద్యార్థిని ఈ ఏడాది మార్చిలో అదృశ్యమై, ఇంటికి సమీపంలోని పొదల్లో శవమై కనిపించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. రామ్‌నాథ్‌పురం జిల్లాకు చెందిన (Dharma Muneeswaran) ధర్మ మునీశ్వరన్ అలియాస్ మహావీరన్‌ను నిందితుడిగా అరెస్ట్ చేశారు. విచారణలో అత్యాచారం, హత్య అభియోగాలు రుజువు కావడంతో న్యాయమూర్తి ప్రీత అతడికి రెండు మరణశిక్షలు విధించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదనే ఉద్దేశంతోనే ఈ కేసును వేగంగా విచారించి తీర్పు తీసుకువచ్చామని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎల్లమ్మాళ్ తెలిపారు.
10 ప్రత్యేక బృందాలు.. పోలీసులకు సవాల్
నేరం జరిగిన ప్రదేశంలో ఎలాంటి సీసీటీవీ కెమెరాలు లేకపోవడం పోలీసులకు సవాల్‌గా మారింది. దీంతో 10 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. సమీప ప్రాంతాల్లోని 98 సీసీటీవీ ఫుటేజీలను, టవర్ డంప్ విధానం ద్వారా 2,574 మొబైల్ నంబర్లను విశ్లేషించారు. ఓ విండ్‌మిల్ (పవన విద్యుత్ కేంద్రం) వద్ద ఉన్న కెమెరాలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒక ద్విచక్ర వాహనం రికార్డు కావడం కేసు దర్యాప్తులో కీలకంగా మారింది. నంబర్ ప్లేట్ మార్చిన ఆ బైక్ దొంగిలించినదిగా గుర్తించిన పోలీసులు, దాని ఆధారంగా నిందితుడిని పట్టుకున్నారు.
సీఎం విజయ్ కీలక ఆదేశాలు..
రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాల విచారణను వేగవంతం చేసి, దోషులకు తగిన శిక్షలు పడేలా చూడాలని ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ పోలీసులను ఆదేశించిన రోజే ఈ తీర్పు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల కోయంబత్తూరులో పదేళ్ల చిన్నారి హత్యాచారం సహా పలు ఘటనలపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో, మహిళల భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.






