9 మందిని హత్యచేసిన 'ట్విట్టర్ కిల్లర్'.. 3 ఏళ్ల తర్వాత ఉరిశిక్ష

by Yella Dhawani Reddy |

జపాన్‌లో సంచలనం సృష్టించిన 'ట్విటర్‌ కిల్లర్‌' తకహిరో షిరైషి(33)కి ఆ దేశ ప్రభుత్వం ఎట్టకేలకు ఉరిశిక్ష అమలు చేసింది.

9 మందిని హత్యచేసిన ట్విట్టర్ కిల్లర్.. 3 ఏళ్ల తర్వాత ఉరిశిక్ష
X

దిశ, వెబ్ డెస్క్: జపాన్‌లో సంచలనం సృష్టించిన 'ట్విటర్‌ కిల్లర్‌' తకహిరో షిరైషి(33)కి ఆ దేశ ప్రభుత్వం ఎట్టకేలకు ఉరిశిక్ష అమలు చేసింది. 2017లో టోక్యో సమీపంలోని జామా నగరంలో తొమ్మిది మందిని (ఎనిమిది మంది మహిళలు, ఒక పురుషుడు) తల, మొండెం, కాళ్లు, చేతులు.. శరీర భాగాలన్నీ ముక్కలుగా నరికి చంపేశాడు. అనంతరం అతని అపార్ట్‌మెంట్‌లోనే ఆ శరీర భాగాలను కూలర్లలో దాచిపెట్టాడు. అప్పట్లో ఈ కేసు దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం రేపింది. అతను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌ (ప్రస్తుత ‘ఎక్స్‌’) ద్వారా బాధితులను సంప్రదించి, ఆత్మహత్య భావనతో ఉన్న వారిని తన ఇంటికి రప్పించి దారుణంగా హత్య చేశాడు. ఈ దారుణమైన చర్యల వల్ల అతడికి ‘ట్విట్టర్‌ కిల్లర్‌’ అనే పేరుపడింది.

కోర్టులో అతడు తన నేరాలను స్వయంగా అంగీకరించటంతో 2020లో కోర్టు షిరైషికి ఉరిశిక్ష విధించింది. తన నేరాలపై ఏమాత్రం పశ్చాత్తాపం లేదని కోర్టులో చెప్పడం గమనార్హం. జపాన్ న్యాయమంత్రి కేయ్‌సుకె సుజుకి తాజాగా ఉరిశిక్షకు ఆమోదమిస్తూ, ఇది 'తీవ్రంగా స్వార్థపూరిత నేరం' అని వ్యాఖ్యానించారు. అయితే, ఇది జపాన్‌లో 2022 తర్వాత మొదటిసారిగా మరణశిక్ష అమలవడం కావడం విశేషం. 2008లో టోక్యో అఖిహబరా కత్తి దాడిలో దోషిగా శిక్షపడిన వ్యక్తికి అదే సంవత్సరం చివరగా ఉరిశిక్ష అమలైంది. జపాన్‌లో ఖైదీలకు కేవలం కొన్ని గంటల ముందు మాత్రమే ఉరి శిక్ష అమలు చేయటంపై సమాచారం ఇవ్వడం వల్ల మానవ హక్కుల సంఘాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. 2018లో ఆమ్‌ షిన్‌రిక్యో కల్ట్ గురు షోకో ఆసహారా, అతని అనుచరుల 12 మందిపై కూడా ఉరిశిక్ష అమలైంది.

Next Story