India-Pakistan: పాకిస్తాన్ కు మరో షాకిచ్చిన భారత్.. ఈ సారి పాక్ జర్నలిస్టులపై భారత్ కొరడా

by Prasad Jukanti |   (  Updated:2025-04-29 07:20:49  IST  )

పాకిస్తాన్ కు భారత్ మరో షాకిచ్చింది.

India-Pakistan: పాకిస్తాన్ కు మరో షాకిచ్చిన భారత్.. ఈ సారి పాక్ జర్నలిస్టులపై భారత్ కొరడా
X

దిశ, డైనమిక్ బ్యూరో: పహెల్గాం ఉగ్రదాడి ఘటన తర్వాత పాకిస్తాన్ విషయంలో భారత ప్రభుత్వం (Indian Government) కఠిన వైఖరి అవలంబిస్తోంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషించి భారత్ పైకి ఎగదోస్తున్న పాకిస్తాన్ కు బుద్ధి చెప్పేందుకు అవసరమైన చర్యలన్నీ ముమ్మరం చేస్తోంది. ఈ క్రమంలో భారత్ పై తప్పుడు ప్రచారం చేస్తున్న పాకిస్తాన్ కు చెందిన 16 యూట్యూబ్ చానళ్లపై నిషేధం విధించిన భారత ప్రభుత్వం.. తాజాగా భారత్ మీడియా సంస్థల తరఫున పని చేస్తున్న పాకిస్తాన్ కు చెందిన కొందరు జర్నలిస్టుల (Pakistan Journalists) ట్విట్టర్ (ఎక్స్) ఖాతాలు బంద్ చేసింది. ఐఎస్ఐ, పాకిస్తాన్ ప్రభుత్వంతో కలిసి భారత్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నందుకు చర్యలు తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో పలువురు జర్నలిస్టుల ట్విట్టర్ ఖాతాలు హోల్డ్ లోకి వెళ్లాయి. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షార్టులు నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

పాక్ కదలికలపై భారత్ నిఘా:

పహెల్గాం ఉగ్రదాడి తర్వాత బార్డర్ లో టెన్షన్ వాతావరణం కొనసాగుతూనే ఉంది. పాక్ కు వ్యతిరేకంగా భారత ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటుంటే దౌత్యపరంగా ఏమీ చేయలేక పాకిస్తాన్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాలను తుంగలోకి తొక్కుతూ అవతలివైపు నుంచి కవ్వింపు చర్యలకు దిగుతోంది. మరో వైపు తమపై భారత్‌ వైమానిక దాడులకు దిగొచ్చన్న ఆందోళనతో భారత వైమానిక దాడులను పసిగట్టడానికి సియాల్‌కోట్‌ ప్రాంతానికి పాకిస్థాన్‌ సైన్యం తన రాడార్‌ వ్యవస్థలను తరలిస్తున్నట్లు సమాచారం. ఇక పాక్ వైపు ప్రతి కదలికలపై ఇండియన్ ఆర్మీ నిఘా పెంచింది. దీంతో సరిహద్దుల్లో ఎప్పుడు ఏం జరగనుందనే టెన్షన్ సర్వత్రా నెలకొంది.

Next Story