- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీవీకే ఎన్నికల మేనిఫెస్టో విడుదల: ఉచిత సిలిండర్లు, మహిళలకు ఆర్థిక సాయం సహా విజయ్ 10 కీలక హామీలు
తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) అధినేత, సినీ నటుడు విజయ్ తమ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) అధినేత, సినీ నటుడు విజయ్ తమ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. మహిళలు, యువత, రైతులు లక్ష్యంగా సామాజిక భద్రతతో పాటు ఆర్థిక సాధికారతే ధ్యేయంగా ఈ మేనిఫెస్టోను రూపొందించారు. కేవలం ఆదర్శాలకే పరిమితం కాకుండా ఆచరణ సాధ్యమయ్యే పథకాలతో ప్రజల ముందుకు వస్తున్నట్లు విజయ్ స్పష్టం చేశారు.
టీవీకే మేనిఫెస్టోలోని 10 కీలక హామీలు ఇవే..
మహిళలకు ఆర్థిక సాయం: 60 ఏళ్లలోపు ఉన్న మహిళా కుటుంబ పెద్దలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం. పెరుగుతున్న జీవన వ్యయాన్ని తట్టుకునేందుకు ప్రతి కుటుంబానికి ఏడాదికి 6 ఉచిత ఎల్పీజీ సిలిండర్లు. పెళ్లి కానుక (మాంగల్యం పథకం) ఆర్థిక ఇబ్బందుల వల్ల వివాహాలు ఆగిపోకూడదనే ఉద్దేశంతో.. పేద కుటుంబాలకు చెందిన వధువులకు ఒక సవరన్ (8 గ్రాములు) బంగారం, నాణ్యమైన పట్టుచీర అందజేత. ఉచిత రెసిడెన్షియల్ పాఠశాలలు.. గ్రామీణ, పట్టణ విద్యార్థుల మధ్య వ్యత్యాసాన్ని తగ్గించడానికి అత్యాధునిక వసతులతో కూడిన ఉచిత గురుకుల పాఠశాలల ఏర్పాటు. వడ్డీ లేని విద్యా రుణాలు.. దేశ విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థుల కోసం ప్రభుత్వ పూచీకత్తుతో రూ.20 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు. మాదకద్రవ్యాల రహిత తమిళనాడు.. డ్రగ్స్ అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతూ, మాదకద్రవ్యాల రహిత రాష్ట్రంగా తమిళనాడును తీర్చిదిద్దడం. ఆరోగ్య బీమా.. మెరుగైన వైద్యం అందరికీ అందేలా ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల కవరేజీతో భారీ ఆరోగ్య బీమా పథకం. నిరుద్యోగ భృతి.. ఉద్యోగాల వేటలో ఉన్న యువతకు అండగా.. డిగ్రీ పూర్తయిన నిరుద్యోగులకు నెలకు రూ.4,000, డిప్లొమా పూర్తి చేసిన వారికి రూ.2,500 చొప్పున భృతి. 5 లక్షల కొత్త ఉద్యోగాలు.. పారిశ్రామిక, ఆర్థిక అభివృద్ధి వ్యూహాల ద్వారా రాష్ట్రంలోని యువత కోసం 5 లక్షల కొత్త ఉద్యోగాల సృష్టి. 5 ఎకరాలలోపు భూమి ఉన్న రైతుల పంట రుణాల పూర్తి మాఫీ. అలాగే, చెరకు రైతులకు టన్నుకు రూ.4,500 కనీస మద్దతు ధర (MSP). సాంప్రదాయ సంక్షేమ పథకాలకు (బంగారం, పట్టు చీరలు), ఆధునిక ఆర్థిక భద్రతా చర్యలను (ఉద్యోగాల సృష్టి, భారీ ఆరోగ్య బీమా) జోడిస్తూ విజయ్ సమతుల్యమైన మేనిఫెస్టోను గురువారం పార్టీ కార్యాలయంలో ప్రకటించారు.






