Actor Vijay: తమిళనాడు 'కస్టడీ మరణ' బాధితుడి కుటుంబాన్ని పరామర్శించిన నటుడు విజయ్

by S Gopi |

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

Actor Vijay: తమిళనాడు కస్టడీ మరణ బాధితుడి కుటుంబాన్ని పరామర్శించిన నటుడు విజయ్
X

దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడులోని శివగంగలో పోలీసు కస్టడీలో మరణించిన 27 ఏళ్ల అజిత్ కుమార్ కుటుంబాన్ని బుధవారం తమిళగ వెట్రి కజగం (టీవీకే) చీఫ్, నటుడు విజయ్ కలిసి సంతాపం తెలిపారు. తిరుభువనంలోని వారి నివాసానికి వెళ్లిన విజయ్, అజిత్ కుమార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, విషాదంలో ఉన్న కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పాలనలో పోలీసు శాఖ 'క్రూరంగా, అమానవీయంగా, అనైతికంగా' పనిచేస్తోందని పేర్కొంటూ, టీవీకే ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తోందన్నారు. తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే బాధిత కుటుంబానికి రూ.5 లక్షలు, అజిత్ కుమార్ సోదరుడికి ఆవిన్‌లో టెక్నీషియన్ ఉద్యోగం, తేని రెవెన్యూ గ్రామంలో మూడు సెంట్ల భూమికి పట్టా సహా పరిహార ప్యాకేజీని ప్రకటించింది. రాష్ట్ర సహకార మంత్రి ఐ పెరియకరుప్పన్ వ్యక్తిగతంగా అపాయింట్‌మెంట్ లెటర్‌ను కుటుంబానికి అందజేశారు. ముఖ్యమంత్రి స్టాలిన్ కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడి తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకుడు ఎడప్పాడి కె పళనిస్వామి కూడా మరుసటి రోజు వారికి ఫోన్ చేసి తన సానుభూతిని తెలియజేశారు. ఈ ఘటనకు సంబంధించి కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి బదిలీ చేసినట్లు స్టాలిన్ మంగళవారం ప్రకటించారు. ఇది ఎవరూ సమర్థించలేని లేదా క్షమించలేని చర్య అని స్టాలిన్ అన్నారు. ఐదుగురు పోలీసులను నిందితులుగా చేర్చారు. దర్యాప్తు నిష్పాక్షికంగా జరుగుతుందనే సందేహం లేకుండా చూసేందుకు కేసును సీబీఐకి బదిలీ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Next Story