జనసందోహం మధ్య టీవీకే అధినేత సంబరాలు.. చెన్నై నివాసం వద్ద శ్రేణులకు అభివాదం

by Ramesh Naini |

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కళగం’ అఖండ విజయం దిశగా దూసుకుపోతోంది.

జనసందోహం మధ్య టీవీకే అధినేత సంబరాలు.. చెన్నై నివాసం వద్ద శ్రేణులకు అభివాదం
X

దిశ, డైనమిక్ బ్యూరో: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) అఖండ విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ తాజా ఎన్నికల్లో టీవీకే రాష్ట్రంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించి సంచలనం సృష్టించింది. ఓట్ల లెక్కింపు ట్రెండ్స్ పార్టీకి అనుకూలంగా ఉండటంతో చెన్నైలోని విజయ్ తల్లిదండ్రుల నివాసం వద్ద పండగ వాతావరణం నెలకొంది. విజయ్ అక్కడికి చేరుకోగానే ఇంటి వెలుపల భారీగా తరలివచ్చిన అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్దపెట్టున నినాదాలు చేశారు. వారి ఉత్సాహం, జనసందోహం మధ్య విజయ్ చిరునవ్వు చిందిస్తూ అందరికీ అభివాదం చేశారు. తనపై, తన పార్టీపై నమ్మకం ఉంచిన ప్రజలకు, శ్రేణులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతెవరిదో..?

ఎన్నికల ఫలితాల ట్రెండ్స్‌ ప్రకారం చూస్తే.. టీవీకే సుమారు 109 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ గెలుపు దిశగా పయనిస్తోంది. అయితే, తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ 118 మంది ఎమ్మెల్యేల బలం అవసరం. అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, సొంతంగా మెజారిటీ మార్కును చేరుకోవడానికి మరికొన్ని సీట్ల దూరంలో టీవీకే నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటులో విజయ్‌తో చేతులు కలిపేది ఎవరు? ఆయనకు మద్దతు ఇచ్చి కింగ్ మేకర్‌గా మారేది ఎవరు? అన్న విషయంపై రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తదుపరి రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Next Story