Tahavvur Rana: నేను పాక్ ఏజెంట్ నే: తహవ్వుర్ రాణా

by S Gopi |

దాడిలో తన ప్రమేయం ఉందని, అప్పుడు తాను అదే నగరంలో ఉన్నట్టు విచారణ సందర్భంగా ఒప్పుకున్నాడు.

Tahavvur Rana: నేను పాక్ ఏజెంట్ నే: తహవ్వుర్ రాణా
X

దిశ, నేషనల్ బ్యూరో: ముంబై ఉగ్రవాద దాడుల కీలక కుట్రదారులలో ఒకరైన తహవ్వూర్ హుస్సేన్ రాణా, ఈ దాడి జరిగిన సమయంలో తాను ముంబైలోనే ఉన్నానని, తాను పాకిస్తాన్ సైన్యానికి నమ్మకమైన ఏజెంట్ అని చెప్పినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. తహవ్వుర్ రాణాను అమెరికా అప్పగించినప్పటి నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ ఐ ఏ) అదుపులో ఉన్న సంగతి తెలిసిందే. ముంబైతో పాటు మనదేశంలో జరిగిన అనేక ఉగ్రవాద దాడుల్లో అతని ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో తహవ్వుర్ రాణా సంచలన విషయాలు బయటపెట్టాడు. ముంబై దాడిలో తన ప్రమేయం ఉందని, అప్పుడు తాను అదే నగరంలో ఉన్నట్టు విచారణ సందర్భంగా ఒప్పుకున్నాడు. ఆ సమయంలో పాకిస్తాన్ కు తాను అత్యంత నమ్మకమైన ఏజెంట్ గా పని చేశానని అంగీకరించాడు.

తాను, తన స్నేహితుడు డేవిడ్ కోల్మన్ హెడ్లీ పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తోయిబాతో కలిసి అనేక శిక్షణ సెషన్‌లు నిర్వహించామన్నారు. ఉగ్రవాద కార్యకలాపాల ప్రణాళికలో భాగంగా ముంబైలో తన సంస్థ ఇమ్మిగ్రేషన్ కేంద్రాన్ని ప్రారంభించడం కోసం ముంబై వచ్చానని, దానికోసం కొన్ని ఆర్థిక లావాదేవీలు చేసినట్టు రాణా వివరించాడు. 26/11 దాడులకు ముందు ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ తో పాటు వివిధ ప్రదేశాలకు వెళ్ళి తనిఖీ చేశానని, ముంబై 26/11 దాడులు పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐ ఎస్ ఐ) సహకారం ఉందని వెల్లడించాడు.

అంతకుముందు గల్ఫ్ యుద్ధం సమయంలో కూడా తనను పాకిస్తాన్ సైన్యం సౌదీ అరేబియాకు పంపిందని చెప్పాడు. విచారణ అనంతరం, ముంబై పోలీసులు రాణాను వీలైనంత త్వరగా అరెస్టు చేసి అదుపులోకి తీసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు.

పాకిస్తాన్ కు చెందిన కెనడియన్ రాణాను ఈ ఏడాది ప్రారంభంలో భారత్ కు రప్పించారు. ఏప్రిల్ 4న అమెరికా సుప్రీంకోర్టు అతని సమీక్ష పిటిషన్‌ను కొట్టివేసిన తర్వాత అతని అప్పగింత ప్రక్రియ జరిగింది.

మేలో భారతదేశానికి తీసుకువచ్చిన తర్వాత రాణాను ఎన్ ఐ ఏ అధికారికంగా జ్యుడీషియల్ కస్టడీలోకి తీసుకుంది. కుట్ర, హత్య, ఉగ్రవాద చర్యకు పాల్పడటం, ఫోర్జరీ వంటి వివిధ ఆరోపణలకు సంబంధించి అతన్ని ప్రశ్నిస్తున్నారు.

గత నెలలో ఢిల్లీ కోర్టు రాణా జ్యుడీషియల్ కస్టడీని జూలై 9 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.

Next Story