ప్రవర్తన సరిగా లేకపోతే దాడులే.. ఇరాన్‍కు ట్రంప్ తాజా హెచ్చరికలు

by Prasad Jukanti |

ప్రవర్తన సరిగా లేకపోతే దాడులే.. ఇరాన్‍కు ట్రంప్ తాజా హెచ్చరికలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు మరోసారి తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ఇరాన్ పంపిన కొత్త శాంతి ప్రతిపాదనలను తాను సమీక్షిస్తున్నానని ఒకవేళ వారు "దురుసుగా ప్రవర్తిస్తే" (Misbehave) తిరిగి సైనిక దాడులు ప్రారంభమవుతాయని హెచ్చరించారు. వెస్ట్ పామ్ బీచ్ నుండి మయామికి బయలుదేరే ముందు ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ.. ఇరాన్ ప్రతిపాదనల గురించి మీడియా ప్రశ్నించగా వారు పంపిన ప్రతిపాదనల సారాంశం నాకు తెలుసన్నారు. అనంతరం ట్రూత్ సోషల్ వేదికగా ఓ పోస్టు చేస్తూ ఇరాన్ ప్రతిపాదనలు ఆమోదయోగ్యంగా ఉంటాయని తాను భావించడం లేదని, ఇరాన్ తన చర్యలకు తగిన మూల్యం చెల్లించలేదని వ్యాఖ్యానించారు.

ఇరాన్ 14 పాయింట్లతో కొత్త ప్రతిపాదన:

ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ 14 పాయింట్లతో కొత్త ప్రతిపాదన తెరపైకి తీసుకువచ్చింది. పాక్ ద్వారా దీన్ని అమెరికాకు పంపించింది. లెబనాన్‍తో సహా అన్ని విధాలుగా యుద్ధాన్ని పొడిగింపును ఇరాన్ తిరస్కరించింది. తాత్కాలిక సంధికి బదులు 30 రోజుల్లో యుద్ధాన్ని శాశ్వతంగా ముగించేలా సమగ్ర పరిష్కారంతో పాటు వ్యూహాత్మకమైన హోర్ముజ్ జలసంధి కోసం కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయడం వంటి కీలక అంశాలు ఇరాన్ ప్రతిపాదనలో ఉన్నాయి. ఈ ఒప్పందం కుదిరిన తర్వాతే ఇరాన్ అణు కార్యక్రమంపై తదుపరి చర్చలు జరుగుతాయని పేర్కొంది. ఈ పరిణామాలపై స్పందించిన ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాజెమ్ ఘరీబాబాది అమెరికా తన వాగ్దానాలకు కట్టుబడి ఉంటుందనే నమ్మకం లేదని ఇప్పుడు బంతి అమెరికా కోర్టులోనే ఉందన్నారు. వారు దౌత్యం వైపు మొగ్గు చూపుతారా లేక ఘర్షణను ఎంచుకుంటారా అనేది వారే తేల్చుకోవాలి. ఇరాన్ రెండింటికీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

Next Story