ఇరాన్ యుద్ధంపై ట్రంప్ స్టేట్‌మెంట్.. 4 శాతం పెరిగిన బ్రెంట్ క్రూడ్ ధర

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-02 02:23:14  IST  )

ట్రంప్ ప్రసంగం ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భగ్గుమన్నాయి. బ్రెంట్ క్రూడ్ 105 డాలర్ల మార్కును దాటగా, పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన మొదలైంది.

ఇరాన్ యుద్ధంపై ట్రంప్ స్టేట్‌మెంట్.. 4 శాతం పెరిగిన బ్రెంట్ క్రూడ్ ధర
X

దిశ, వెబ్‌డెస్క్: ఇరాన్‌తో వార్‌పై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా ప్రకటన అంతర్జాతీయ చమురు మార్కెట్లలో ప్రకంపనలు సృష్టిస్తోంది. వైట్‌హౌస్ నుంచి డొనాల్డ్ ట్రంప్ జాతిని ఉద్దేశించి ప్రసంగించిన కొద్దిసేపటికే ముడిచమురు ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయ ప్రామాణికమైన బ్రెంట్ క్రూడ్ (Brent Crude) ధర బ్యారెల్‌కు 105 డాలర్ల మార్కును దాటగా, అమెరికన్ చమురు ధర డబ్ల్యూటీఐ (WTI) బ్యారెల్‌కు 103 డాలర్ల పైకి చేరింది.

మార్కెట్ ఆందోళనకు కారణాలివే..

ప్రపంచ చమురు సరఫరాలో అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) గుండా రవాణా నిలిచిపోతుందనే భయాందోళనలు ఇన్వెస్టర్లలో పెరిగాయి. ట్రంప్ తన ప్రసంగంలో ఈ జలసంధి గురించి ప్రస్తావించడం మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. ఇరాన్ సైనిక సామర్థ్యం దెబ్బతిన్నదని, నాయకత్వం అంతమైందని ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో పశ్చిమ ఆసియా (Middle East) నుంచి చమురు సరఫరాకు ఆటంకం కలుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కేవలం మార్చి నెలలోనే చమురు ధరలు దాదాపు 54 శాతం మేర పెరగడం గమనార్హం. ఇది 1990 తర్వాత నమోదైన అత్యధిక నెలవారీ పెరుగుదలగా రికార్డులకు ఎక్కింది. ఓ వైపు యుద్ధం కొనసాగుతుండగా క్షేత్రస్థాయిలో ఉద్రిక్తతలు తగ్గకపోవడంతో చమురు ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ యుద్ధం ముదిరితే బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 150 డాలర్ల వరకు వెళ్లవచ్చని అంచనా వేస్తున్నారు. ఇది భారత్ వంటి చమురు దిగుమతి చేసుకునే దేశాలపై పెను ఆర్థిక భారాన్ని మోపనుంది.

Next Story