- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ రాత్రికే ఇరాన్ పని ఖతం.. ట్రంప్ సంచలన హెచ్చరిక
మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పాలకులకు ఊహించని రీతిలో అల్టిమేటం జారీ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పాలకులకు ఊహించని రీతిలో అల్టిమేటం జారీ చేశారు. ఇరాన్ తన మొండివైఖరిని వీడకపోతే, ఈ రాత్రితో ఆ దేశ నాగరికత ముగిసిపోతుందని ఆయన తీవ్రస్థాయిలో హెచ్చరించారు. సోషల్ మీడియా వేదికగా ఆయన చేసిన వరుస పోస్ట్‌లు ఇప్పుడు అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తున్నాయి. "ఈ రాత్రికి ఇరాన్ పని కతం కాబోతోంది.. అది మళ్లీ తిరిగి రాదు" అంటూ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ప్రభుత్వం తలొగ్గకపోతే భారీ దాడులు తప్పవని ఆయన సంకేతాలిచ్చారు. "నిజానికి ఇరాన్‌ను అంతం చేయడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. కానీ ఆ పని చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది" అని ఆయన పేర్కొన్నారు. తమ దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వస్తోందని వివరించారు.
47 ఏళ్ల అరాచకానికి ముగింపు..
ఇరాన్‌లో గత 47 ఏళ్లుగా సాగుతున్న అవినీతి, దోపిడీ, మరణాల పాలన ఈ రోజుతో అంతం కాబోతోందని ట్రంప్ ప్రకటించారు. ఇది ఇరాన్ ప్రజలకు విముక్తి కలిగించే సమయమని ఆయన అభివర్ణించారు. ఇరాన్‌లో ప్రస్తుతం భిన్నమైన, తెలివైన నాయకత్వం కనిపిస్తోందని.. వారి వల్ల ఏవైనా అద్భుతాలు జరిగి యుద్ధం తప్పుతుందేమో వేచి చూడాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచ చరిత్రలోనే ఈ రాత్రి అత్యంత కీలకమైనదని, ఇరాన్ ప్రజలను దేవుడు చల్లగా చూడాలని (God Bless the People of Iran) ఆయన తన సందేశాన్ని ముగించారు.
ఎందుకు ఈ హెచ్చరిక..?
హోర్ముజ్ జలసంధిని (Strait of Hormuz) తెరవాలని, లేనిపక్షంలో ఇరాన్ లోని విద్యుత్ కేంద్రాలు, వంతెనలు, మౌలిక సదుపాయాలపై కనికరం లేకుండా దాడులు చేస్తామని ట్రంప్ ఇప్పటికే గడువు విధించారు. ఈ గడువు ముగియనున్న నేపథ్యంలో ఆయన ఈ 'చివరి హెచ్చరిక' జారీ చేశారు. ట్రంప్ హెచ్చరికలతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకవేళ అమెరికా దాడులకు దిగితే, అది మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందేమోనని విశ్లేషకులు భయపడుతున్నారు. ఇరాన్ సైతం తమ రక్షణ కోసం సిద్ధమవుతున్నట్లు సమాచారం.






