ట్రంప్ వార్నింగ్: "మంగళవారమే అసలైన ఆట".. ఇరాన్ లక్ష్యంగా అమెరికా భారీ యుద్ధ ప్రణాళిక

by Gantepaka Srikanth |

మధ్య ప్రాచ్యంలో యుద్ధ మేఘాలు మరింత దట్టమవుతున్నాయి.

ట్రంప్ వార్నింగ్: మంగళవారమే అసలైన ఆట.. ఇరాన్ లక్ష్యంగా అమెరికా భారీ యుద్ధ ప్రణాళిక
X

దిశ, వెబ్‌డెస్క్: మధ్య ప్రాచ్యంలో యుద్ధ మేఘాలు మరింత దట్టమవుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఘర్షణ ముదురుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. తాజా పరిణామాల ప్రకారం ఇరు పక్షాలు పరస్పర దాడులతో విరుచుకుపడుతున్నాయి. ఇరాన్ కూల్చివేసిన ఎఫ్-15 (F-15) యుద్ధ విమానానికి చెందిన మిస్సింగ్ సిబ్బందిని అమెరికా దళాలు ఆదివారం విజయవంతంగా రక్షించాయి. దీనిపై డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ, ఇది అమెరికా చరిత్రలోనే అత్యంత సాహసోపేతమైన ఆపరేషన్లలో ఒకటిగా అభివర్ణించారు. ఈ క్రమంలో ఇరాన్‌కు మరో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ మౌలిక సదుపాయాలే లక్ష్యంగా మంగళవారం భారీ దాడులు చేయబోతున్నట్లు ట్రంప్ సామాజిక మాధ్యమాల వేదికగా హెచ్చరించారు. "మంగళవారం పవర్ ప్లాంట్ డే, బ్రిడ్జ్ డే" అంటూ ఇరాన్‌కు గట్టి సంకేతాలిచ్చారు. అంటే పవర్ ప్లాంట్‌లు, వంతెనలే లక్ష్యంగా దాడులు చేస్తామని హెచ్చరించారు.

కువైట్‌లో డ్రోన్ దాడి..

మరోవైపు.. కువైట్‌లోని చమురు మంత్రిత్వ శాఖ భవనం లక్ష్యంగా డ్రోన్ దాడి జరగడంతో అక్కడ భారీగా మంటలు చెలరేగాయి. సిరియా రాజధాని డమాస్కస్, దాని పరిసర ప్రాంతాల్లో వరుస పేలుళ్లు సంభవించాయి. ఇరాన్-అమెరికా యుద్ధం నేపథ్యంలో సరిహద్దుల గుండా దాడులు కొనసాగుతున్నట్లు సిరియా మీడియా పేర్కొంది. దక్షిణ లెబనాన్ పట్టణాలైన ఐనాతా, మరోన్ అల్-రాస్ ప్రాంతాల్లో ఇజ్రాయెల్ దళాలపై హెజ్బొల్లా క్షిపణి దాడులు చేసింది. దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ విమానాలు బీరుట్‌లో దాడులు నిర్వహించాయి.

హోర్ముజ్ జలసంధిపై ప్రభావం..

ఇరాన్ హోర్ముజ్ జలసంధిని మూసివేసే దిశగా ప్రయత్నిస్తుండటంతో అంతర్జాతీయ చమురు మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడుతోంది. అయితే త్వరలోనే ఆ మార్గాన్ని తెరిపిస్తామని ట్రంప్ ప్రతిజ్ఞ చేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో హోర్ముజ్ జలసంధి భద్రతకు సంబంధించి బహ్రెయిన్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని చైనా వ్యతిరేకించింది. ఇరాన్ కూడా అమెరికా ప్రతిపాదించిన 48 గంటల కాల్పుల విరమణ ఒప్పందాన్ని తిరస్కరించింది.

Next Story