భారత్‌లో ట్రంప్ కుమార్తె సందడి.. భర్తతో కలిసి తాజ్ మహల్ సందర్శించిన టిఫనీ (ఫోటోలు)

by Ramesh Naini |

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె టిఫనీ ట్రంప్, ఆమె భర్త మైఖేల్ బౌలోస్‌ శనివారం ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఉన్న చారిత్రక అద్భుతం తాజ్ మహల్‌ను సందర్శించారు.

భారత్‌లో ట్రంప్ కుమార్తె సందడి.. భర్తతో కలిసి తాజ్ మహల్ సందర్శించిన టిఫనీ (ఫోటోలు)
X

దిశ, డైనమిక్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె టిఫనీ ట్రంప్, ఆమె భర్త మైఖేల్ బౌలోస్‌ శనివారం ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఉన్న చారిత్రక అద్భుతం తాజ్ మహల్‌ను సందర్శించారు. తమ వ్యక్తిగత పర్యటనలో భాగంగా ఇండియాకు వచ్చిన ఈ జంట.. సుమారు గంటపాటు ఈ పాలరాతి కట్టడ ప్రాంగణంలో గడిపారు.

తాజ్ అందాలకు ఫిదా.. భారీ భద్రత

ఉదయం 11 గంటల సమయంలో తాజ్ మహల్ వద్దకు చేరుకున్న వారు, కట్టడ నిర్మాణం , చరిత్రను గైడ్‌ల ద్వారా ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. తాజ్ అందాల నేపథ్యంలో ఈ జంట పలు ఫోటోలు దిగి సందడి చేశారు. తాజ్ మహల్ కంటే ముందు రోజు న్యూఢిల్లీలోని అక్షరధామ్ ఆలయాన్ని సైతం ఈ దంపతులు సందర్శించారు. భారతీయ సంస్కృతి, వారసత్వాన్ని ప్రతిబింబించే ఈ పర్యటన ‘అద్భుతం’ అంటూ టిఫనీ తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. భారత్‌లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ కూడా వీరికి స్వాగతం పలికారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక చార్టర్డ్ విమానంలో ఆగ్రా చేరుకున్న టిఫనీ జంట కోసం అధికారులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. విమానాశ్రయం నుంచి తాజ్ మహల్ వరకు హై-సెక్యూరిటీ కారిడార్‌ను ఏర్పాటు చేశారు. టిఫనీ, డొనాల్డ్ ట్రంప్ ఆయన మాజీ భార్య మార్లా మేపుల్స్‌ల నాలుగో సంతానం. ఆమె 2022 నవంబర్‌లో అమెరికన్-లెబనీస్ వ్యాపారవేత్త మైఖేల్ బౌలోస్‌ను వివాహం చేసుకున్నారు.

కాగా, 2020లో అమెరికా అధ్యక్ష హోదాలో డొనాల్డ్ ట్రంప్ సైతం తన భార్య మెలానియాతో కలిసి తాజ్ మహల్‌ను సందర్శించిన విషయం తెలిసిందే. ఇటీవల ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ దంపతులతో పాటు, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో దంపతులు వంటి పలువురు అంతర్జాతీయ ప్రముఖులు కూడా ఈ చారిత్రక కట్టడాన్ని సందర్శించారు.

Next Story