Cabinet meet: ట్రంప్ టరీఫ్ ల ఎఫెక్ట్.. కేంద్ర క్యాబినెట్ కీలక భేటీ

by Shamantha N |

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలు విధిస్తున్నారు. భారత్‌పై అమెరికా (India-USA) విధించిన 26 శాతం సుంకాలు బుధవారం నుంచి అమల్లోకి వచ్చాయి.

Cabinet meet: ట్రంప్ టరీఫ్ ల ఎఫెక్ట్.. కేంద్ర క్యాబినెట్ కీలక భేటీ
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలు విధిస్తున్నారు. భారత్‌పై అమెరికా (India-USA) విధించిన 26 శాతం సుంకాలు బుధవారం నుంచి అమల్లోకి వచ్చాయి. అయితే, వాణిజ్య యుద్ధం భయంతో అంతర్జాతీయంగా స్టాక్‌ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇలాంటి సమయలో కేంద్ర ప్రభుత్వం కీలక క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించనుంది. వాటి ప్రభావాన్ని తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ భేటీలో చర్చించనున్నారు (Trump tariffs). అయితే, సెమీకండక్టర్లు, రాగి, ఔషధాలను అమెరికా సుంకాల నుంచి మినహాయించగా.. ఆటో విడిభాగాలు, రత్నాలు, ఆభరణాలు వంటి కీలక రంగాల్లో ఎగుమతులపై ప్రభావం పడనుంది. ఈ పరిణామాల నేపథ్యంలో సమావేశంలో తీసుకునే నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఇప్పటికే 10 శాతం అమలు

ట్రంప్ విధించిన టారిఫ్‌లలో ఇప్పటికే 10 శాతం అమల్లోకి రాగా.. మరో 16 శాతం బుధవారం నుంచి అమలవుతోంది. ఇప్పటివరకు, ప్రభుత్వం ఈ అంశంపై జాగ్రత్తగా వ్యవహరించింది. భారతదేశం అమెరికాపై ప్రతి-సుంకాలు విధించే అవకాశం లేదని వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అమెరికా పర్యటన సందర్భంగా ప్రకటించిన అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందంపై ప్రభుత్వం చురుకుగా పనిచేస్తోంది. మార్చిలో రెండు దేశాలు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA) కోసం నిబంధనలకు అంగీకరించాయి. ‘‘డొనాల్డ్‌ ట్రంప్‌ విధించిన టారిఫ్‌ల నుంచి ఉపశమనం కలిగించే మార్గాలపై మోదీ ప్రభుత్వం దృష్టిసారించింది. అయితే, ఇవి పరస్పర ప్రతీకారంగా ఉండకూడదని భావిస్తోంది. అలాంటి ఒప్పందాల దిశగా సిద్ధమవుతోంది’’ అని ప్రభుత్వ అధికారి ఒకరు ఇటీవల వెల్లడించారు. కాగా.. ట్రంప్ ప్రకటించిన భారీ సుంకాలు ప్రత్యర్థి ఎగుమతిదారులను మరింత ప్రభావితం చేస్తాయని, భారత్ కు అవకాశాలను అందిస్తాయని నిపుణులు అంటున్నారు. ఆసియా దేశాలైన చైనా (34%), వియత్నాం (46%), ఇండోనేషియా (32%) అధిక సుంకాల బారిన పడ్డారు.

Next Story