Trump: యూఎస్‌కు జీరో టారిఫ్ ఆఫర్.. డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు

by B.Srinivas |

అమెరికా భారత్‌ల మధ్య ట్రేడ్ డీల్‌పై చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలోనే యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Trump: యూఎస్‌కు జీరో టారిఫ్ ఆఫర్.. డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా భారత్‌ల మధ్య ట్రేడ్ డీల్‌ (Trade deal) పై చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలోనే యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ఉత్పత్తులపై టారిఫ్‌లను ఎత్తివేసేందుకు ఇండియా సిద్ధమైందని తెలిపారు. జీరో టారిఫ్ ప్రతిపాదనను భారత్ ముందుకు తీసుకొచ్చిందని చెప్పారు. దోహాలో జరిగిన ఓ సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘భారత్‌లో ఏదైనా అమ్మడం చాలా కష్టం. కానీ ఇండియా నుంచి మాకు ఓ ఆఫర్ వచ్చింది. వారు యూఎస్‌కు జీరో టారిఫ్ ఇచ్చేందుకు ముందుకొచ్చారు. అమెరికా ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను తొలగించాలని భారత్ ప్రతిపాదించింది. దీనిని అమలు చేసేందుకు వారు సిద్ధంగా ఉన్నారు’ అని వ్యాఖ్యానించారు. ట్రంప్ ప్రకటన హాట్ టాపిక్‌గా మారడంతో విదేశాంగ మంత్రి జైశంకర్ (Jai shanker) స్పందించారు. భారత్ యూఎస్ ల మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. ఇరు దేశాల మధ్య అనేక సవాళ్లున్నాయని, ఇంకా ఎటువంటి ఒప్పందం ఖరారు కాలేదని చెప్పారు. ట్రేడ్ డీల్ పరస్పర ప్రయోజనకరంగా ఉండటం ఎంతో ముఖ్యమని తెలిపారు.

రేపు అమెరికాకు భారత అధికారుల బృందం

కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలోని బృందం శనివారం అమెరికా పర్యటనకు వెళ్లనుంది. మే 17 నుంచి 20 వరకు టూర్ కొనసాగనుండగా ఇరు దేశాల వాణిజ్య ఒప్పందంపై చర్చించనున్నారు. అమెరికా వాణిజ్య ప్రతినిధి జామిసన్ గ్రీర్, వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్‌లతో చర్చలు జరపనున్నట్టు తెలుస్తోంది. సెప్టెంబర్-అక్టోబర్ నాటికి విస్తృత వాణిజ్య ఒప్పందం మొదటి దశను ఖరారు చేయాలని రెండు దేశాలు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. దీంతో పీయూష్ గోయల్ పర్యటన ఆసక్తికరంగా మారింది.

Next Story