- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Trump: మూడో ప్రపంచ యుద్ధం రాకుండా నిరోధిస్తా- ట్రంప్
మూడో ప్రపంచ యుద్ధం రాకుండా ఆపేస్తానని అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చెప్పుకొచ్చారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీ(Washington DC)లో జరిగిన ర్యాలీలో ట్రంప్ ప్రసంగించారు.

దిశ, నేషనల్ బ్యూరో: మూడో ప్రపంచ యుద్ధం రాకుండా ఆపేస్తానని అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చెప్పుకొచ్చారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీ(Washington DC)లో జరిగిన ర్యాలీలో ట్రంప్ ప్రసంగించారు. కాపిటల్ వన్ అరీనాలో జరిగిన మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ (MAGA) 'విజయ ర్యాలీ'లో మాట్లాడుతూ ‘మేము గెలిచాం’ అంటూ తను చేయబోయే కార్యక్రమాల గురించి మాట్లాడారు. "మేం ప్రజలకు అమెరికన్ చరిత్రలో ఏ అధ్యక్షుడికైనా లేని అత్యుత్తమ మొదటి రోజు, అతిపెద్ద మొదటి వారం, అత్యంత అసాధారణమైన మొదటి 100 రోజులను ఇవ్వబోతున్నాము" అని అన్నారు. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్(outgoing President Joe Biden) పదవీవిరమణ చేసిన గంటల్లోనే ఓవల్ కార్యాలయానికి తిరిగి వచ్చి కార్యనిర్వాహక పనులు చేపడతానని హామీ ఇచ్చారు. అమెరికన్ల బలం, శ్రేయస్సు, గౌరవం, గర్వంతో సరికొత్త రోజును ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ర్యాలీకి స్నేహితులు, మద్దతుదారులు, నిజమైన అమెరికన్ దేశభక్తులు హాజరైనందుకు సంతోషంగా ఉందన్నారు.
దేశంపై దండయాత్ర ఆపుతాం
మంగళవారం సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయానికి "దేశంపై దండయాత్రను" ఆపుతానని ట్రంప్ హామీ ఇచ్చారు. సరిహద్దు అతిక్రమణదారులందరూ ఏదో ఒక రూపంలో దేశం వదిలి ఇంటికి తిరిగి వెళ్తారన్నరు. మన దేశాన్ని మనం తిరిగి స్వాధీనం చేసుకోబోతున్నామని చెప్పారు. చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా అక్రమ వలసదారులను బయటకు పంపిస్తానని ట్రంప్ వ్యాఖ్యానించారు. దేశ సంపదను తిరిగి పొందబోతున్నామన్నారు. ప్రమాణస్వీకారం చేసిన రోజు కల్లా నాలుగేళ్ల అమెరికా క్షీణతకు తెరపడుతుందన్నారు. అంతేకాకుండా మహిళల క్రీడల్లో ట్రాన్స్‌జెండర్లు పాల్గొనకుండా నిలువరిస్తానని హామీ ఇచ్చారు. "నేను ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని అంతం చేస్తాను. మధ్యప్రాచ్యంలో గందరగోళాన్ని ఆపుతాను. మూడో ప్రపంచ యుద్ధం జరగకుండా నేను నిరోధిస్తాను. ఇవి జరగకుండా చేసేందుకు మేము ఎంత దగ్గరగా ఉన్నామో మీకు తెలియదు" అని ట్రంప్ అన్నారు. గాజాలో ఇజ్రాయెల్- హమాస్ మధ్య 15 నెలల పాటు జరిగిన ఘర్షణపైనా ట్రంప్ స్పందించారు. గాజా కాల్పుల విరమణ ఒప్పందానికి ఆయన క్రెడిట్ తీసుకున్నారు. ఆ సమయంలో తాను అధ్యక్షుడైతే యుద్ధం జరిగేది కాదని పేర్కొన్నారు.






