తొమ్మిదేళ్ల తర్వాత చైనాకు ట్రంప్‌.. ఆ విషయంలో ట్రంప్ కు జిన్‌పింగ్‌ హెచ్చరిక

by Prasad Jukanti |   (  Updated:2026-05-14 05:54:44  IST  )

తొమ్మిదేళ్ల తర్వాత చైనాలో పర్యటిస్తున్న ట్రంప్ జిన్‌పింగ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తైవాన్ అంశంపై చైనా అధ్యక్షుడు ఘాటు హెచ్చరికలు జారీ చేశారు.

తొమ్మిదేళ్ల తర్వాత చైనాకు ట్రంప్‌..  ఆ విషయంలో  ట్రంప్ కు జిన్‌పింగ్‌ హెచ్చరిక
X

దిశ, డైనమిక్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మూడు రోజుల పర్యటనలో భాగంగా బీజింగ్ చేరుకున్నారు. చివరి సారిగా 2017లో అధ్యక్ష హోదాలో చైనాలో పర్యటించిన ట్రంప్ తొమ్మిదేళ్ల అనంతరం చైనాకు ట్రంప్ రావడం అంతర్జాతీయ రాజకీయవర్గాల్లో ఆసక్తిగా మారింది. హర్మూజ్ జలసంధి, ప్రపంచ ఆర్థిక సంక్షోభం వేళ ఇవాళ చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‍తో ద్వైపాక్షిక భేటీలో ట్రంప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా తైవాన్ అంశం చర్చకు వచ్చినట్లు చైనా అధికారిక మీడియా వెల్లడించింది. ఈ సందర్బంగా తైవాన్ విషయంలో ట్రంప్‍కు చైనా ప్రెసిడెంట్ హెచ్చరించినట్లు అక్కడి మీడియా పేర్కొనడం సంచలనంగా మారింది.

తేడా వస్తే ఘర్షణే:

చైనా, అమెరికా మధ్య తైవాన్ అంశమే అత్యంత కీలకమైనదని ద్వైపాక్షిక భేటీలో జిన్ పింగ్ స్పష్టం చేసినట్లు మీడియా సమాచారం. తైవాన్ అంశాన్ని తప్పుగా హ్యాండిల్ చేసినా సరిగ్గా పరిష్కరించకపోయినా ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా-చైనా మధ్య ఘర్షణ తలెత్తే ప్రమాదం ఉందని జిన్ పింగ్ హెచ్చరించినట్లు చైనా అధికారిక మీడియా పేర్కొంది. తైవాన్ జలసంధిలో శాంతి, స్థిరత్వం అనేది చైనా-అమెరికా సంబంధాలలో అత్యంత ముఖ్యమైన అంశం అని జిన్‍పింగ్ స్పష్టం చేశారు.

గొప్ప మిత్రుడు:

ఈ సమావేశానికి ముందు మాట్లాడిన ట్రంప్ జిన్‌పింగ్‌ తో తనకు ఉన్న వ్యక్తిగత అనుబంధం గురించి చెప్పారు. జిన్‍పింగ్ ఒక గొప్ప నాయకుడు, మంచి మిత్రుడిగా అభివర్ణించారు. ఇరు దేశాల మధ్య అద్భుతమైన భవిష్యత్ ఉండాలని ఆకాంక్షించారు. తాను అలా మాట్లాడటం కొందరికి నచ్చకపోయినా.. అదే వాస్తవమని ట్రంప్‌ పేర్కొన్నారు.

గూగుల్‌పై జర్నలిస్టుల యుద్ధం.. ఇల్లినోయి కోర్టులో సంచలన పిటిషన్ దాఖలు

Next Story