Donald Trump: పదవి చేపట్టగానే పదుల కొద్దీ ఆర్డర్లపై సంతకాలు

by Shamantha N |

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump) పదవి చేపట్టగానే పని మొదలు పెట్టారు. పదులకొద్దీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు.

Donald Trump: పదవి చేపట్టగానే పదుల కొద్దీ ఆర్డర్లపై సంతకాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump) పదవి చేపట్టగానే పని మొదలు పెట్టారు. పదులకొద్దీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు. ముఖ్యంగా మాజీ అధ్యక్షుడు బైడెన్ పాలనలో జారీ చేసిన 78 ఆదేశాలను వెనక్కి తీసుకున్నారు. ప్యారిస్‌ పర్యావరణ ఒప్పందం నుంచి వైదొలగడం, ప్రభుత్వాన్ని ఆయుధంలా ప్రత్యర్థులపై వాడటం, వాక్‌ స్వేచ్ఛకు రక్షణ, .. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలగడం, దీంతోపాటు జీవన వ్యయాల సంక్షోభంపై దృష్టిపెట్టాలని అన్ని ఏజెన్సీలకు మార్గదర్శకాలు, ప్రభుత్వ ఉద్యోగులు కచ్చితంగా కార్యాలయాలకు వచ్చి విధుల్లో హాజరుకావాలన్న ఆదేశాలు ఉన్నాయి. అంతేకాదు కెనడా, మెక్సికోలపై ఫిబ్రవరి 1 నుంచి 25శాతం అదనపు సుంకాలు విధించనున్నట్లు ట్రంప్‌ అల్టిమేటమ్‌ జారీ చేశారు. తొలి 8 ఆదేశాలపై సంతకాలు చేసిన తర్వాత జనంలోకి పెన్నుని విసిరారు. ప్రజల్ని ఉత్సాహపరిచారు.

కీలక ఉత్తర్వులు

ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా వైదొలగింది. కొవిడ్ వ్యాప్తి సమయంలో డబ్ల్యూహెచ్ఓ నిర్లక్ష్యంగా వ్యవహరించందని ట్రంప్ ఆరోపించారు. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా, ఏఐ విస్తరణను నియంత్రిస్తూ బైడెన్‌ జారీ చేసిన ఆదేశాలను ట్రంప్‌ తొలగించారు. సరిహద్దు గోడ సామగ్రిని విక్రయించాలన్న బైడెన్‌ ఆదేశాలను ట్రంప్‌ వెనక్కి తీసుకొన్నారు. అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో కొన్నాళ్లుగా ఈ గోడ సామగ్రిని వేలంలో విక్రయిస్తున్నారు. చైనా కంపెనీ టిక్‌టాక్‌ అమెరికా విభాగాన్ని విక్రయించేందుకు ట్రంప్ సర్కారు 75 రోజుల సమయం ఇస్తూ నిర్ణయం తీసుకొంది. అమెరికాకు ఆ యాప్‌లో 50శాతం వాటా ఉండాలని ట్రంప్‌ ఈసందర్భంగా వ్యాఖ్యానించారు. గతంలో బైడెన్‌ కార్యవర్గం వాక్‌ స్వేచ్ఛపై నియంత్రణ విధించడాన్ని ట్రంప్‌ సీరియస్‌గా పరిగణించారు. దీంతో, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ జస్టిస్‌, డైరెక్టరేట్‌ ఆఫ్‌ నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ విస్తృతంగా దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఎలక్ట్రిక్ వాహనాలపై ట్రంప్ తీసుకున్న నిర్ణయం టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కు షాక్ ఇచ్చింది. 2030 నుంచి విక్రయించే కొత్త కార్లలో కనీసం 50శాతం విద్యుత్తు వాహనాలు ఉండాలంటూ బైడెన్‌ తీసుకొన్న నిర్ణయాన్ని ట్రంప్‌ తొలగించారు.

పుట్టకతో పౌరసత్వం వచ్చే చట్టం రద్దు

ఇక, ట్రంప్ వలసలపై ఉక్కుపాదాన్ని మోపారు. పుట్టుకతో పౌరసత్వం వచ్చే చట్టాన్ని కొత్త అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ (Donald Trump) రద్దు చేసి షాక్ ఇచ్చారు. వలస వచ్చిన వారికి అమెరికా గడ్డపై పిల్లలు పుడితే.. ఆ చిన్నారులకు సహజంగా పౌరసత్వాన్ని అందించే చట్టాన్ని ట్రంప్ రద్దు చేశారు. అమెరికా రాజ్యాంగంలో 14వ సవరణ ప్రకారం పిల్లలకు ఈ హక్కు సంక్రమించాల్సి ఉంటుంది. అయితే, దీనిపైనే ట్రంప్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ జారీ చేశారు. ‘‘అక్రమ వలసదారులకు అమెరికాలో పుట్టే పిల్లలకు లభించే పౌరసత్వాన్ని మా ఫెడరల్‌ ప్రభుత్వం గుర్తించదు’’ అని ట్రంప్‌ కామెంట్స్ చేశారు. అయితే, అమెరికా మాత్రమే ఇలాంటి పౌరసత్వం అందిస్తోందని ట్రంప్‌ అన్నారు. కానీ, అది అవాస్తవమని తేలింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 దేశాలు ఈ విధానంలోనే పౌరసత్వాన్ని అందజేస్తున్నాయి. అమెరికాలో అంతర్యుద్ధం తర్వాత 1868లో చేసిన 14వ రాజ్యాంగ సవరణ శరణార్థుల పిల్లలకు పుట్టుకతోనే పౌరసత్వాన్ని అందిస్తోంది. ఈ విధానం దాదాపు వందేళ్లుగా అమలులో ఉంది. అక్రమ చొరబాటుదారులకు పుట్టిన పిల్లలకూ, టూరిస్టు లేదా స్టూడెంట్‌ వీసాపై వచ్చిన వారికి అమెరికాలో కాన్పు కాగా పుట్టిన పిల్లలకూ ఈ నియమం వర్తిస్తుంది. కాగా, ఈ విధానాన్ని రద్దు చేసే ప్రయత్నానికి న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. మరోవైపు, ఆయన ప్రభుత్వం వలస విధానంపై తీసుకొనే చర్యలకు ఇది చిహ్నమని నిపుణులు చెబుతున్నారు.

Next Story