Trump: యుద్ధంలో ప్రజలు చనిపోవడంపై పుతిన్ ఆందోళన.. డొనాల్డ్ ట్రంప్

by B.Srinivas |

ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో సాధారణ పౌరులు చనిపోవడంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆందోళన చెందుతున్నట్టు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.

Trump: యుద్ధంలో ప్రజలు చనిపోవడంపై పుతిన్ ఆందోళన.. డొనాల్డ్ ట్రంప్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో సాధారణ పౌరులు చనిపోవడంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ (Putin) ఆందోళన చెందుతున్నట్టు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తెలిపారు. ఈ మరణాలను ఆపాలని ఆయన కోరుకుంటున్నారని వెల్లడించారు. తాజాగా ట్రంప్ ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడారు. యుద్ధాన్ని ఆపాలని పుతిన్‌తో ఇటీవల ఫోన్‌లో మాట్లాడినట్టు తెలిపారు. తనకు పుతిన్‌తో మంచి సంబంధం ఉందని ప్రజలు చనిపోవడం ఆపాలని ఆయన కోరుకుంటున్నారని చెప్పారు. ‘రష్యా ఉక్రెయిన్ యుద్ధం గత మూడేళ్లుగా కొనసాగుతోంది. నేను 2022లో అధ్యక్షుడిని అయితే ఇది ప్రారంభమయ్యేది కాదు. ప్రస్తుతం నా దగ్గర రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడానికి ఒక నిర్దిష్ట ప్రణాళిక ఉంది. యుద్ధం చాలా దారుణంగా ఉంది కాబట్టి ఇది త్వరలోనే ముగిసిపోవాలని ఆశిస్తున్నా’ అని తెలిపారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత పుతిన్, అమెరికా అధ్యక్షుడికి మధ్య జరిగిన ప్రత్యక్ష సంభాషణ ఇదే కావడం గమనార్హం.

అయితే పుతిన్, ట్రంప్ మధ్య జరిగిన సంభాషణపై క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ (Dimithri pescove) స్పందించారు. మాట్లాడుకోవడానికి వివిధ మార్గాలు ఉన్నాయని, ఈ విషయంపై నాకు వ్యక్తిగతంగా తెలియదని స్పష్టం చేశారు. దీనిని ధ్రువీకరించలేనని, అలాగే తిరస్కరించలేనని తెలిపారు. కాగా, డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడైనప్పటి నుండి, రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపాలని పలువురు భావిస్తున్నారు. దీనికి సంబంధించి త్వరలోనూ చర్చలు జరగనున్నట్టు పలు కథనాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలోనే ట్రంప్ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. 2022 ఫిబ్రవరి 24న యుద్ధం ప్రారంభమైన విషయం తెలిసిందే.

Next Story