Trump: ట్రంప్ గోల్ఫ్ రిసార్టుపై పాలస్తీనా మద్దతు దారుల దాడి

by B.Srinivas |

గాజాను అమెరికా స్వాధీనం చేసుకుంటుందని ఇటీవల ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా పాలస్తీనా మద్దతుదారులు గోల్ఫ్ రిసార్డుపై దాడికి పాల్పడ్డారు.

Trump: ట్రంప్ గోల్ఫ్ రిసార్టుపై పాలస్తీనా మద్దతు దారుల దాడి
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపు(Donald Trump)నకు షాక్ తగిలింది. గాజా(Gaza)ను అమెరికా స్వాధీనం చేసుకుంటుందని ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా పాలస్తీనా మద్దతుదారులు స్కాట్లాండ్‌ (scatland)లోని సౌత్ ఐర్ షైర్‌లో ఉన్న ట్రంప్ గోల్ఫ్ రిసార్డు (Golf Resort)పై దాడికి పాల్పడ్డారు. రిసార్టులోని సామగ్రిని ధ్వంసం చేశారు. అంతేగాక గోల్ఫ్ కోర్సు గోడలపై ఎరుపు రంగుతో ‘ఫ్రీ గాజా’ ‘ఫ్రీ పాలస్తీనా’ నినాదాలు రాశారు. అలాగే ‘గాజా ఈజ్ నాట్ ఫర్ సేల్’ అని గోల్ఫ్ కోర్సులోని ప్రాంగణంలో రాశారు. ఈ ఘటనకు పాలస్తీనా యాక్షన్ అనే సంస్థ బాధ్యత వహించింది. ‘ట్రంప్ గాజాను తన ఆస్తిగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ తన సొంత ఆస్తి కూడా సురక్షితంగా లేదని తెలుసుకోవాలి’ అని ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ఓపెన్ చాంపియన్‌షిప్‌లలో ఒకటైన కోర్సులోని అత్యంత ప్రసిద్ధి చెందిన గ్రీన్స్‌ను కూడా నిరసనకారులు ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది. స్కాట్లాండ్ పోలీసులు సైతం దీనిని ధ్రువీకరించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.

కాగా, ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం భీకరంగా సాగుతున్న క్రమంలో అమెరికా, ఈజిప్టు, ఖతార్ మధ్య వర్తిత్వంతో ఇరు పక్షాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. అయితే గాజాలో ప్రస్తుతం శాంతి యుత పరిస్థితులు నెలకొనడంతో భవిష్యత్‌లో గాజాను స్వాధీనం చేసుకుని ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని ట్రంప్ ఇటీవల వ్యాఖ్యానించారు. దీనిని పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఈ నేపథ్యంలోనే ట్రంపు గోల్ఫ్ రిసార్డుపై దాడి జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Next Story