- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Donald Trump: అమెరికాలో ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించే దిశగా నిర్ణయం
అమెరికాలో ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించే దిశగా ట్రంప్(Donald Trump) సర్కారు అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తోంది.

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాలో ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించే దిశగా ట్రంప్(Donald Trump) సర్కారు అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తోంది. కాగా.. దీనిపైనే ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్‌మెంట్ నుంచి ఒక మెమో వెలువడింది. ప్రభుత్వ ఉద్యోగుల ప్రమాణాలు, ప్రవర్తన, అనుకూలతలను పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకొన్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి ఈమెయిల్ 20 లక్షల మంది ఉద్యోగులకు వెళ్లింది. స్వచ్ఛందంగా ఉద్యోగాలను వదులుకొంటే ఎనిమిది నెలల జీతం ఇస్తారని అందులో పేర్కొంది. ఫిబ్రవరి 6లోగా ఓ నిర్ణయం తీసుకోవాలనేది అందులోని సారాంశం. అంతేకాకుండా, కొవిడ్ తర్వాత చాలామంది ఉద్యోగులు రిమోట్ విధానంలో పని చేస్తున్నారు. అయితే, వారందరూ వారానికి ఐదు రోజులు ఆఫీసులకు రావాలని ట్రంప్ సర్కారు తేల్చిచెప్పింది. ఆఫీసులకు రావడం ఇష్టంలేని వారు కూడా దీన్ని ఎంచుకోవచ్చని మెయిల్ లో పేర్కొంది. సుమారు 10-15శాతం మంది స్వచ్ఛందంగా ఉద్యోగం వదులుకునే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే.. అమెరికా ప్రభుత్వ ఖర్చులు ఏటా 100 బిలియన్ డాలర్ల వరకు తగ్గవచ్చని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అధ్యక్షుడు ఎవరెట్ కెల్లీ మాట్లాడుతూ దీనిని వాలంటరీ బైఔట్ గానే చూడాలన్నారు.
ఫెడరల్ నిధులు, రుణాలు నిలిపివేత
అయితే, ఫెడరల్ నిధులు, రుణాలను నిలిపివేసినట్లు ట్రంప్ ప్రభుత్వం ప్రకటించిన వేళ వాలంటరీ బైఔట్ వార్త రావడం చర్చనీయాంశంగా మారింది. స్థానిక సంస్థల ప్రభుత్వాలు, నాన్ ప్రాఫిట్ సంస్థలపై దీని ప్రభావం ఉండనుంది. ప్రభుత్వం అందించే ఫెడరల్ గ్రాంట్లు, రుణాలను జనవరి 28 నుంచి నిలిపివేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశించారు. ఇప్పటి వరకు కొనసాగుతున్న గ్రాంట్లపై సమీక్షలు కొనసాగుతున్నందున వీటిని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు మేనేజ్‌మెంట్ అండ్ బడ్జెట్ కార్యాలయం వెల్లడించింది. అయితే, ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంతో విదేశాలకు, స్వచ్ఛంద సంస్థలకు చేసే ఆర్థిక సాయం ఆగిపనుంది. అంతేకాకుండా విద్య, వైద్య సంరక్షణ కార్యాక్రమాలు, నిర్మాణ, విపత్తు నిర్వహణపై ఈ ప్రభావం పడనుంది. అయితే, ఈ నిర్ణయం సామాజిక భద్రత లేదా మెడికేర్ చెల్లింపులు, వ్యక్తులకు నేరుగా అందించే ఆర్థికసాయంపై ప్రభావం చూపదని వైట్‌హౌస్ వర్గాలు పేర్కొన్నాయి.






