Trump: రేపు ట్రంప్ జెలెన్ స్కీ కీలక భేటీ.. ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ !

by B.Srinivas |

రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపడానికి అమెరికాతో సహా ప్రపంచ దేశాలు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.

Trump: రేపు ట్రంప్ జెలెన్ స్కీ కీలక భేటీ.. ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ !
X

దిశ, నేషనల్ బ్యూరో: రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపడానికి అమెరికాతో సహా ప్రపంచ దేశాలు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌లు ఇటీవల భేటీ అయ్యి పలు అంశాలపై చర్చించారు. ఈ నేపథ్యంలోనే సోమవారం ట్రంప్, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీల మధ్య వైట్ హౌస్‌లో కీలక భేటీ జరగనుంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ సమావేశంపై ఆసక్తి నెలకొంది. అయితే ట్రంపుతో జరిగే ఈ కీలక సమావేశంలో పలువురు యూరోపియన్ యూనియన్ (ఈయూ) నాయకులు సైతం జెలెన్ స్కీకి మద్దతుగా హాజరుకానున్నట్టు తెలుస్తోంది. ట్రంప్, జెలెన్ స్కీ మధ్య గతంలో జరిగిన భేటీలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరగగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో మరోసారి అటువంటి పరిస్థితి లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు సమాచారం. ఈ సమావేశంలో జెలెన్ స్కీతో పాటు యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లేయన్, జర్మన్ చాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, ఇటలీ ప్రధాని మెలోనిలు పాల్గొననున్నట్టు తెలుస్తోంది.

జెలెన్ స్కీపై ఒత్తిడి !

ఇటీవల పుతిన్‌తో భేటీలో రష్యా ప్రతిపాదనకు ట్రంప్ మద్దతిచ్చినట్టు పలు కథనాలు వెల్లడించాయి. పలు భూభాగాలను తమకు ఇవ్వాలని పుతిన్ తెలిపినట్టు పేర్కొన్నాయి. తూర్పు ఉక్రెయిన్‌లోని డొనెట్స్క్ , లుగాన్స్క్ ప్రాంతాలతో కూడిన డాన్‌బాస్‌ను ఉక్రెయిన్ విడిచిపెట్టాలని పుతిన్ డిమాండ్ చేసినట్టు వెల్లడించాయి. దీంతో ఆ భూభాగాన్ని రష్యాకు అప్పగించేలా ట్రంప్ జెలెన్ స్కీపై ఒత్తిడి తీసుకురానున్నట్టు తెలుస్తోంది. కానీ ఈ ప్రక్రియలో ఉక్రెయిన్ ప్రయోజనాలు విస్మరించబడతాయని యూరోపియన్ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. అందుకే యూరోపియన్ స్వరం గట్టిగా వినిపించేలా ఆ దేశాల అగ్రనాయకులు ఈ చర్చల్లో పాల్గొంటారని సన్నిహిత వర్గాలు తెలిపాయి.

శాంతి ఒప్పందానికి వెళ్తుందా?

కాల్పుల విరమణ ఒప్పందాలు తరచుగా నిలబడబోవని, భయంకరమైన యుద్ధానికి ముగింపు పలకాలంటే శాంతి ఒప్పందమే మేలని పుతిన్‌తో భేటీ అనంతరం ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే దీనిపై స్పందించిన జెలెన్ స్కీ దీనిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రష్యాకు భూమిని అప్పగించే ఏ ఒప్పందానికి మేము అంగీకరించలేమని ఉక్రెయిన్ అధికారులు సైతం తేల్చి చెప్పారు. దీంతో ట్రంప్, జెలెన్ స్కీల మధ్య జరిగే భేటీలో రష్యా ప్రతిపాదనకు జెలెన్ స్కీ అంగీకరిస్తారా లేదా అనే ఉత్కంఠ నెలకొంది.

22న త్రైపాక్షిక శిఖరాగ్ర సమావేశం !

ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధాన్ని ఆపడానికి ఒక మార్గాన్ని కనుగొనగలిగేలా ఆగస్టు 22 నాటికి పుతిన్, జెలెన్ స్కీలతో త్రైపాక్షిక శిఖరాగ్ర సమావేశాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు ట్రంప్ ఇటీవలే తెలిపారు. అయితే దీనిని ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు. జెలెన్ స్కీతో భేటీ అనంతరం దీనిపై ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఉక్రెయిన్ దీనిపై ఆసక్తి చూపిస్తున్నప్పటికీ రష్యా దీనిపై స్పందించలేదు.

Next Story