Trump: బిగ్ బ్యూటిఫుల్ బిల్ చిచ్చు.. ట్రంప్, మస్క్ మాటల యుద్ధం

by B.Srinivas |

బిగ్ బ్యూటీఫుల్ బిల్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ మధ్య విభేదాలు నెలకొన్నాయి.

Trump: బిగ్ బ్యూటిఫుల్ బిల్ చిచ్చు.. ట్రంప్, మస్క్ మాటల యుద్ధం
X

దిశ, నేషనల్ బ్యూరో: బిగ్ బ్యూటీఫుల్ బిల్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ (Elon musk) మధ్య విభేదాలు నెలకొన్నాయి. ఈ బిల్లు యూఎస్ పార్లమెంటులో ఆమోదం పొందితే మరుసటి రోజే అమెరికాలో కొత్త పార్టీ పెడతానని మస్క్ హెచ్చరించారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా ట్రంపుపై విమర్శలు గుప్పించారు. ‘ఈ వెర్రి బిల్లు సెనేట్‌లో ఆమోదం పొందితే, మరుసటి రోజే అమెరికాలో కొత్త పార్టీ ఏర్పడుతుంది. డెమొక్రటిక్, రిపబ్లికన్ పార్టీలు మాత్రమే గాక దేశానికి ప్రత్యామ్నాయ పార్టీ అవసరం. తద్వారా ప్రజలకు నిజమైన గొంతు వినిపించే అవకాశం కలుగుతుంది. ప్రభుత్వ వ్యయం తగ్గింపు, దేశ చరిత్రలో అత్యధిక రుణాల పెరుగుదలకు మద్దతు ఇస్తున్న ప్రతి సభ్యుడు సిగ్గుతో తలదించుకోవాలి. వారు వచ్చే ఏడాది జరగనున్న ప్రాథమిక ఎన్నికల్లో ఓడిపోతారు’ అని పేర్కొన్నారు. బిగ్ బ్యూటిఫుల్ బిల్లు ద్వారా పన్ను చెల్లింపుదారులపై అధిక భారం పడుతుందని తెలిపారు. రిపబ్లికన్లు ఆర్థిక సంప్రదాయవాద విలువలను విడిచిపెట్టారని ఆరోపించారు.

మస్క్ సౌత్ ఆఫ్రికా వెళ్లాల్సిందే: ట్రంప్

మస్క్ వ్యాఖ్యలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. అత్యధిక సబ్సిడీలు మస్క్ కంపెనీలకే అందుతున్నాయని, వాటిని ఆపేస్తే దుకాణం బంద్ పెట్టుకుని దక్షిణాఫ్రికాకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రభుత్వ సబ్సిడీ రూపంలో మస్క్ అందరికంటే ఎక్కువ డబ్బు అందుకున్నారని పేర్కొన్నారు. ఎలోన్ మస్క్ నన్ను అధ్యక్షుడిగా ఆమోదించే ముందే నేను ఈవీ దేశాలకు వ్యతిరేకమని తెలుసని గుర్తు చేశారు. ‘మస్క్ చరిత్రలో ఎవరికన్నా ఎక్కువ సబ్సిడీలను పొందాడు. సబ్సిడీలు లేకపోతే మస్క్ దుకాణాన్ని మూసివేసి దక్షిణాఫ్రికాకు తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. ఇకపై రాకెట్ ప్రయోగాలు, ఉపగ్రహాలు, ఎలక్ట్రిక్ కార్లు ఉత్పత్తి చేయబడవు. దీని వల్ల చాలా డబ్బు ఆదా చేస్తుంది. డోజ్ దీనిపై అధ్యయనం చేయాలి’ అని వ్యాఖ్యానించారు.

వివాదానికి కారణమిదే?

ట్రంప్ తన ఎన్నికల వాగ్దానాలను అమలు చేయడానికి బిగ్ బ్యూటిఫుల్ బిల్లును తీసుకుకొచ్చారు. పన్ను కోతలు, సరిహద్దు భద్రతపై ఖర్చును పెంచడం, పలు ప్రభుత్వ కార్యక్రమాలను తగ్గించడమే లక్ష్యంగా ఈ బిల్లును రూపొందించారు. అయితే ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ) కొనుగోలుపై ప్రస్తుతం ఉన్న 7,500 డాలర్ల పన్ను రాయితీని బిల్లు రద్దు చేస్తుందని ఆందోళనలున్నాయి. దీని వల్ల ఈవీల కొనుగోలుపై ప్రత్యక్ష భారం పడడంతో పాటు ధరలు సైతం పెరగనున్నాయి. దీంతో టెస్లా వంటి కంపెనీలపై ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే మస్క్ ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారు.

Next Story