ట్రంప్ కొత్త ట్యాక్స్ బిల్.. లాభం ఎవరికి?

by Phanindra |

డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కొత్త ట్యాక్స్ బిల్ తీసుకొచ్చింది. దీనివల్ల ఎవరికి లాభం ఎక్కువ?

ట్రంప్ కొత్త ట్యాక్స్ బిల్.. లాభం ఎవరికి?
X

దిశ, నేషనల్ బ్యూరో: యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. తన ప్రభుత్వం సిద్ధం చేసిన ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్’కు హౌస్ ఆఫ్ రిప్రజంటేటివ్స్ ఆమోదం లభించినట్లు ట్రంప్ ప్రకటించారు. 215-214 ఓట్ల తేడాతో ఈ బిల్లు ఆమోదం పొందింది. సెనేట్లో ఈ బిల్లులో మరికొన్ని మార్పులు జరిగే అవకాశాలున్నాయి. ఈ బిల్లులో యూఎస్ నుంచి విదేశాలకు పంపించే నగదుపై 3.5 శాతం ట్యాక్స్ విధించాలని ప్రతిపాదించారు. ఈ ట్యాక్స్ వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. యూఎస్ నుంచి విదేశాలకు పంపే నగదుపై 5 శాతం పన్ను విధించాలని తొలుత అనుకున్న రిపబ్లికన్లు.. చివరకు దీన్ని 3.5 శాతానికి తగ్గించినట్లు సమాచారం. ఇక ఈ కొత్త బిల్లు ప్రకారం 2017లో ట్రంప్ తీసుకొచ్చిన ట్యాక్స్ కట్స్ శాశ్వతంగా అమలవుతాయి. ఈ బిల్లు వల్ల అమెరికన్ ప్రజలకు కొంత లబ్ధి చేకూరే అవకాశం ఉంది. అయితే ఎక్కువగా లాభం పొందేది మాత్రం ధనికులేనని నిపుణులు వాదిస్తున్నారు. యూఎస్ ఖజానాపై కూడా దీని వల్ల తీవ్రమైన ప్రభావం పడుతుందని చెప్తున్నారు.

యూఎస్‌లో ఏడాదికి 50 వేల డాలర్లు, అంతకన్నా తక్కువ సంపాదించే వారిపై కొత్త బిల్లు ప్రభావం చూపుతుందని, వీరికి వచ్చే తక్కువ ఆదాయంలోనే మెడికైడ్, ఫుండ్ స్టాంప్స్ (స్నాప్), స్టూడెంట్ లోన్ సపోర్ట్ తదితర కటింగ్స్ ఉండటంతో ఇబ్బందులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే మెడికైడ్‌కు ప్రభుత్వం అందించే నిధుల్లో 698 బిలియన్ డాలర్లను ఈ బిల్ ఆపేస్తుందని, దీంతో కనీసం 76 లక్షల మంది అమెరికన్లకు హెల్త్ ఇన్సూరెన్స్ అందకుండా పోతుందని తెలిపారు. ఆహారం అందించే స్నాప్ వ్యవస్థకు అందించే నిధుల్లో కూడా ఈ బిల్లు 267 బిలియన్ డాలర్లు తగ్గిస్తోందని, దీన్నుంచి తప్పించుకొని ఆహారం పొందాలంటే 55-64 ఏళ్ల మధ్య ఉన్న వాళ్లు కూడా పనులు చేయాల్సి వస్తుంది. యూఎస్‌లో 4 కోట్లమందికిపైగా ప్రజలు ఈ స్నాప్ వ్యవస్థ ద్వారా ఆహారం అందుకుంటారు.

ఇక చదువు కోసం చేసే స్టూడెంట్ లోన్స్‌ను రద్దు చేసేందుకు యూఎస్ మాజీ అధ్యక్షుడు జో బైడెన్ తీసుకొచ్చిన నియమాలను ట్రంప్ ప్రభుత్వం రద్దు చేయనుంది. అలాగే అండర్‌గ్రాడ్యుయేట్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు లభించే లోన్ అమౌంట్‌పై పరిమితులు విధించేలా ఈ బిల్లులో నిబంధనలు తీసుకొచ్చారు. సరైన ధ్రువపత్రాలు లేకుండా యూఎస్‌లో ఉంటున్న వారికి, వారి పిల్లలకు ఉచితంగా వైద్య సహకారం అందించే అవకాశం లేకుండా ఈ బిల్లు చేస్తుంది. ఇంతకాలం యూఎస్‌లోని పలు స్టేట్స్.. తమ స్థానిక నిధులతో ఇలాంటి ధ్రువపత్రాలు లేని చిన్నారులకు ఉచితంగా వైద్యం అందించేవి. ఇప్పుడు ఇలా చేయకుండా కొత్త బిల్లు ఆంక్షలు విధిస్తుంది. అలాగే యూఎస్‌‌లో ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకునే శరణార్థులు.. అప్లికేషన్ ఫీజు కింద వెయ్యి డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే వర్క్ పర్మిట్ల కోసం వీళ్లు ఆరు నెలలకోసారి 500 డాలర్ల ఫీజు కట్టాలి. కోర్టు కేసుల్లో తీర్పులపై అప్పీల్ చేసుకోవడానికి కూడా వలసదారులు భారీగా ఫీజులు కట్టేలా కొత్త బిల్లులో నిబంధనలు తీసుకొచ్చారు.




ట్రంప్ బిల్లులో ప్రధానాంశాలు

  • యూఎస్ నుంచి విదేశాలకు పంపించే నగదుపై 3.5 శాతం రిమిటెన్స్ ట్యాక్స్ విధించనున్నారు. ఇది అక్కడ పనిచేస్తున్న విదేశీయులందరిపైనా ప్రభావం చూపనుంది.
  • ఏడాదికి 2,17,000 డాలర్లు, అంతకన్నా ఎక్కువ సంపాదించే వారిపై ట్యాక్స్ చాలా వరకు తగ్గనుంది. అయితే దీని వల్ల లబ్ది పొందే వారిలో కనీసం 25 శాతం మంది ఏడాదికి మిలియన్ డార్లపైగా సంపాదించే వారే అని నిపుణులు అంటున్నారు.
  • యూఎస్‌లో అందించే చైల్డ్ ట్యాక్స్ క్రెడిట్‌ పరిమితిని 2000 డాలర్ల నుంచి 2500 డాలర్లకు పెంచారు. అయితే తల్లిదండ్రులిద్దరికీ సోషల్ సెక్యూరిటీ నెంబర్ ఉంటేనే ఈ లబ్ది చేకూరుతుందని షరతు విధించారు. దీని వల్ల కనీసం 45 లక్షల మంది చైల్డ్ ట్యాక్స్ క్రెడిట్‌కు అర్హత కోల్పోనున్నారు.
  • అలాగే 8 ఏళ్లలోపు చిన్నారుల పేరిట సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసేందుకు కుటుంబంలో ఎంత మంది పిల్లలుంటే అన్ని వేల డాలర్లు ప్రభుత్వం అందిస్తుంది. ఈ అకౌంట్లకు ‘మాగా’ (మనీ అకౌంట్స్ ఫర్ గ్రోత్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్) అని పేరు పెట్టారు.
  • యూఎస్‌లో స్వదేశీ కార్లు కొనే వారి కారు లోన్ వడ్డీని 10 వేల డాలర్ల వరకు తగ్గించనున్నారు. అయితే ఇది కేవలం స్వదేశంలో తయారు చేసిన కార్లు కొన్నవారికే ఈ తగ్గుదల లభిస్తుంది.
  • ఉద్యోగులకు ఓవర్‌టైం చేయడం వల్ల లభించే ఆదాయంపై పన్ను, సోషల్ సెక్యూరిటీ, మెడికేర్ కటింగ్స్ కూడా ఉండవు.
  • యూఎస్‌లో ఇకపై వెయిటర్లు, ఇతర రంగాల్లో టిప్స్ పొందే ఉద్యోగులు.. ఈ టిప్స్ ఆదాయంపై ట్యాక్స్ చెల్లించే అవసరం లేదు.
Next Story