US: అమెరికా పౌరసత్వ దరఖాస్తులో నిబంధనలు మరింత కఠినతరం

by S Gopi |

'గుడ్ మోరల్ క్యారెక్టర్ ' అంచనా వేయడానికి ట్రంప్ ప్రభుత్వం మరింత కఠినమైన ప్రమాణాలను ప్రవేశపెడుతోంది.

US: అమెరికా పౌరసత్వ దరఖాస్తులో నిబంధనలు మరింత కఠినతరం
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునే వలసదారులకు ట్రంప్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునే వారి పరిశీలనకు సంబంధించి నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా 'గుడ్ మోరల్ క్యారెక్టర్ ' అంచనా వేయడానికి ట్రంప్ ప్రభుత్వం మరింత కఠినమైన ప్రమాణాలను ప్రవేశపెడుతోంది. అమెరికా వలస చట్టాన్ని పర్యవేక్షించే సమాఖ్య యూఎస్ సిటిజెన్‌షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) జారీ చేసిన మెమోలో దరఖాస్తుదారు ప్రవర్తన, నేపథ్యాన్ని మరింత సమగ్రంగా సమీక్షిస్తారు. దేశానికి అందించే సానుకూల సహకారంతో పాటు ప్రతికూల ప్రవర్తన రెండింటినీ పరిగణనలోకి తీసుకోనున్నారు.

ఉత్తర్వుల ప్రకారం.. 'గుడ్ మోరల్ క్యారెక్టర్' నిర్ణయించే సమయంలో మరిన్ని అంశాలను పరిశీలించాలని యూఎస్‌సీఐఎస్ ఆదేశించింది. గతంలోనూ ప్రమాణాలు ఉన్నప్పటికీ, కొత్తగా మరిన్ని విషయాలను ఇందులో చేర్చారు. ప్రస్తుతం అమెరికా శాశ్వత నివాసం లేదా గ్రీన్ కార్డు ఉన్న వలసదారులు నిబంధనల ప్రకారం 3 లేదా 5 ఏళ్లకు సహజ అమెరికా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికోసం ఇంగ్లీష్, సిటిజన్ పరీక్షల్లో పాస్ అవ్వాలి. అలాగే, 'గుడ్ మోరల్ క్యారెక్టర్' కలిగి ఉండటం నిబంధనగా ఉంది. అయితే, తాజాగా యూఎస్‌సీఐఎస్ ఇచ్చిన ఆదేశాల్లో 'గుడ్ మోరల్ క్యారెక్టర్' అంచనాల్లో ఇదివరకే ఉన్న వాటితో పాటు దరఖాస్తు చేసుకున్న వ్యక్తి తీవ్రమైన నేరాలకు పాల్పడ్డారా? మాదకద్రవ్యాలు లేదంటే తాగుడుకు బానిసా అనే విషయాలను పరిశీలించనున్నారు. అదే విధంగా.. ట్రాఫిక్ ఉల్లంఘనలు, వేధింపులు, దూకుడు స్వభావం కలిగి ఉండటం వంటి విషయాలను కూడా పరిగణలోకి తీసుకోనున్నారు.

అంతేకాకుండా.. స్వచ్ఛంద, సమాజ సేవ, కుటుంబ సంబంధాలు, విద్యా నేపథ్యం, చట్టబద్ధ, స్థిరమైన ఉద్యోగ నేపథ్యం, పన్ను చెల్లింపులను పరిశీలించనున్నారు. వలస వ్యవస్థను పటిష్టం చేయడంలో భాగంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారని యూఎస్‌సీఐఎస్ ప్రతినిధి మాథ్యూ ట్రాగెసర్ అన్నారు. అమెరికా పౌరసత్వం అనేది గోల్డెన్ ఛాన్స్. దీన్ని ప్రపంచంలోనే అత్యుత్తమైన వారికి మాత్రమే ఇవ్వాలి. ఇందుకు కొత్త పౌరులు అమెరికా సంస్కృతి, చరిత్ర, భాషను స్వీకరించడమే కాకుండా, గుడ్ మోరల్ క్యారెక్టర్‌ను సహజంగా కలిగి ఉండేలా చేసే కొత్త అంశాలను చేరుస్తున్నామని ఆయన వివరించారు. కాగా, అమెరికా ప్రభుత్వం డేటా ప్రకారం, గడిచిన పదేళ్లలో ఏడాదికి 6 లక్షల నుంచి 10 లక్షల మంది వలసదారులు అమెరికా పౌరులుగా మారుతున్నారు. తాజా ప్రమాణాలు రానున్న రోజుల్లో వీటిపై ప్రభావం చూపవచ్చు.

Next Story