Trump: బ్రిక్స్ దేశాలపై 10శాతం టారిఫ్.. ట్రంప్ సంచలన ప్రకటన

by B.Srinivas |

భారత్‌తో సహా బ్రిక్స్‌లో సభ్యత్వం కలిగిన దేశాలు 10 శాతం సుంకాన్ని ఎదుర్కోవలసి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు.

Trump: బ్రిక్స్ దేశాలపై 10శాతం టారిఫ్.. ట్రంప్ సంచలన ప్రకటన
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌తో సహా బ్రిక్స్‌లో సభ్యత్వం కలిగిన దేశాలు 10 శాతం సుంకాన్ని ఎదుర్కోవలసి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తెలిపారు. అమెరికాను దెబ్బతీసేందుకు, డాలర్ విలువను దిగజార్చేందుకు ఈ కూటమి ఏర్పాటు చేశారని ఆరోపించారు. బ్రిక్స్ దేశాలు అమెరికా డాలర్‌ను బలహీనపరుస్తున్నాయని, డాలర్‌ను అణగదొక్కాలని చూస్తున్న దేశాలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. వైట్ హౌస్‌లో ట్రంప్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. బ్రిక్స్‌ను అమెరికా ప్రయోజాలకు ముప్పుగా అభివర్ణించారు. ‘భారత్ బ్రిక్స్‌లో ఉంటే ఖచ్చితంగా 10 శాతం టారిఫ్ చెల్లించాలి. ఎందుకంటే యూఎస్‌కు హానీతలపెట్టడానికి, డాలర్ విలువను పతనం చేయడానికి స్థాపించారు. వారు తమ ఆట ఆడాలనుకుంటే, నేను కూడా వారి ఆట ఆడగలను. కాబట్టి బ్రిక్స్‌లో ఉన్న ఎవరైనా పది శాతం సుంకాలు చెల్లించాల్సిందే’ అని స్పష్టం చేశారు. టారిఫ్‌ల చెల్లింపు ఆగస్టు 1నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు. ఇక గడువు పొడిగింపులు ఉండబోవని తేల్చి చెప్పారు. డాలరే కింగ్ అని మేము దానిని అలాగే ఉంచుతామని తెలిపారు.

రాగి దిగుమతులపై 50 శాతం సుంకం

రాగి దిగుమతులపై 50 శాతం, ఔషధాలపై 200 శాతం సుంకం విధించబోతున్నట్టు తెలిపారు. దీనిపై త్వరలోనే ప్రకటన విడుదల చేస్తామని, ఏడాది తర్వాత అమల్లోకి వస్తుందన్నారు. దేశీయ పరిశ్రమకు హానీ కలిగించే ప్రతి రంగాన్ని అమెరికా లక్ష్యంగా చేసుకుంటుందని తెలిపారు. రాగి, ఔషధాలతో పాటు మరిన్ని సుంకాలు విధించడానికి దారితీసే కలప, సెమీకండక్టర్లు, కీలకమైన ఖనిజాల దిగుమతులపైనా దృష్టి సారించాలని ఆదేశించారు.

Next Story