బెంగాల్‌లో 4 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక.. క్లీన్ స్వీప్‌పై టీఎంసీ కన్ను

by S Gopi |
బెంగాల్‌లో 4 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక.. క్లీన్ స్వీప్‌పై టీఎంసీ కన్ను
X

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్‌లోని నాలుగు అసెంబ్లీ స్థానాలకు బుధవారం ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), బీజేపీ మధ్య వైరం విపరీతస్థాయిలో ఉండగా, ఈ బైపోల్‌తో చిన్నపాటి యుద్ధ వాతావరణం నెలకొంది. విజయం సాధిస్తామని ఇరు పార్టీల నుంచి గట్టిగానే ప్రకటనలు వస్తున్నాయి. మరోవైపు ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేయగా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బలగాలను పంపించింది. ఈ క్రమంలో ఇటీవల ఎన్నికల్లో సీట్లు తగ్గిన కారణంగా నైతిక స్థైర్యాన్ని పెంపొందించేందుకు బీజేపీ ప్రయత్నిస్తుండగా, టీఎంసీ అధిక్యాన్ని ఉపయోగించి విజయాన్ని దక్కించుకోవాలని లక్ష్యంగా ఉంది. బుధవారం మానిక్తలా, రాయ్‌గంజ్, రణఘాట్ దక్షిణ్, బాగ్దా అసెంబీ స్థానాల్లో పోలింగ్ జరగనుంది. ఉప ఎన్నికలు జరిగే నాలుగు చోట్ల 2021 అసెంబ్లీ ఎన్నికల సమయంలో మూడు స్థానాలను బీజేపీ గెలుచుకుంది. అయితే, వారు తర్వాత అధికార పార్టీలోకి వెళ్లిపోయారు. మానిక్తలా నియోజకవర్గం ఎమ్మెల్యే, టీఎంసీ నేత సాధన్ పాండే మరణించడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో దాదాపు 10 లక్షల మంది ఓటర్లు ఉండగా, కౌంటింగ్ జూలై 13న జరుగుతుంది.

Advertisement

Next Story

Most Viewed