- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ స్పామ్ కాల్స్‌కి చెక్: TRAI – RBI సంయుక్త చర్యలు ప్రారంభం
వినియోగదారులకు అనవసరంగా వచ్చే లోన్‌లు, క్రెడిట్ కార్డుల ప్రమోషన్‌లకు సంబంధించిన స్పామ్ కాల్స్, మెసేజ్‌లు రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో.. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సంయుక్తంగా కీలక చర్యలు చేపట్టాయి.

దిశ, వెబ్‌డెస్క్: వినియోగదారులకు అనవసరంగా వచ్చే లోన్‌లు, క్రెడిట్ కార్డుల ప్రమోషన్‌లకు సంబంధించిన స్పామ్ కాల్స్, మెసేజ్‌లు రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో.. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సంయుక్తంగా కీలక చర్యలు చేపట్టాయి. వినియోగదారుల అనుమతి లేకుండా కంపెనీలు పంపుతున్న కమర్షియల్ మెసేజ్‌లు, కాల్స్‌పై నియంత్రణ తీసుకొచ్చేందుకు, డిజిటల్ కన్సెంట్ మేనేజ్‌మెంట్ పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు.
ఈ మేరకు జూన్ 13న TRAI అన్ని టెలికాం సేవలందించే సంస్థలను, RBIతో కలసి ఈ పైలట్ ప్రాజెక్ట్‌లో భాగస్వాములుగా ఉండాలని ఆదేశించింది. ఈ ప్రాజెక్ట్‌ను ప్రస్తుతానికి బ్యాంకింగ్ రంగంతో ప్రారంభించనున్నారు. ఫైనాన్షియల్ లావాదేవీల సున్నితత్వం, స్పామ్ కాల్స్ ద్వారా జరిగే మోసాల నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని బ్యాంకింగ్ రంగాన్ని మొదటి దశలోకి తీసుకొచ్చినట్లు కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ జూన్ 16న విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది.
ఈ పైలట్ ప్రాజెక్ట్ రెగ్యులేటరీ శాండ్‌బాక్స్ విధానంలో అమలవుతుంది. ఇందులో వినియోగదారుల డిజిటల్ అనుమతులను సురక్షితంగా నమోదు చేయడం, కమర్షియల్ కమ్యూనికేషన్ పంపే ముందు ఆ అనుమతి నిజమైందా అనే విషయాన్ని టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు తేల్చే విధంగా సాంకేతిక వ్యవస్థను అభివృద్ధి చేయనున్నారు. సంస్థలు వినియోగదారుల అనుమతి తీసుకోవడం తప్పనిసరి కాగా, దానిని టెలికాం డేటాబేస్‌లో నమోదు చేయకపోతే, వాటి ద్వారా పంపే ప్రకటనలు అనధికారికంగా పరిగణించి చర్యలు తీసుకోనున్నారు.
ఇకపై వినియోగదారుని కేవలం ఒకసారి కొనుగోలు చేసిన నేపథ్యంతో, లేదా ఇతర పద్ధతుల్లో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా పొందిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని కంపెనీలు స్వచ్ఛందంగా ప్రకటనలు పంపడం కుదరదు. TRAI చెప్పిన దాని ప్రకారం.. ఈ కొత్త కన్సెంట్ ఫ్రేమ్‌వర్క్ సక్రమంగా పని చేయాలంటే కమర్షియల్ మెసేజ్‌లు పంపే అన్ని సంస్థలు ఈ వ్యవస్థలో సభ్యత్వం కలిగి ఉండాలి.
ఇప్పటికే TRAI అనేక చర్యలు తీసుకుంది. డి.ఎన్.డి (Do Not Disturb)లో నమోదు కాని వినియోగదారులు కూడా అశాస్త్రీయంగా వస్తున్న స్పామ్ కాల్స్‌పై ఫిర్యాదు చేయగలిగే అవకాశాన్ని కల్పించింది. స్పామ్ కోసం ఉపయోగించే టెలికాం నంబర్లను నిలిపివేయడమూ కొనసాగుతోంది. అయితే వినియోగదారు నిజంగా అనుమతి ఇచ్చాడా? అనే విషయం ఇప్పటికీ స్పష్టంగా నిర్ధారించటం కష్టమైన పని అని TRAI అభిప్రాయపడుతోంది.
ఇదిలా ఉంటే, జనవరిలో RBI బ్యాంకులకు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ట్రాన్సాక్షనల్ కాల్స్ కోసం మాత్రమే ‘1600xx’ సిరీస్ నంబర్లను, ప్రమోషనల్ కాల్స్ కోసం ‘140xx’ సిరీస్ నంబర్లను వినియోగించాలి. ఇది వినియోగదారులకు ఫేక్ కాల్స్ గుర్తించేందుకు సహాయపడుతుంది. ఈ మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఇటీవలే పబ్లిక్ అడ్వైజరీ జారీ చేసింది. +91-1600 సిరీస్ నంబర్ల నుండి వచ్చే కాల్స్ ట్రాన్సాక్షనల్ పద్ధతిలో మాత్రమే ఉండేవి అని పేర్కొంది. కాబట్టి వినియోగదారులు ఈ నంబర్లకు నమ్మకంగా స్పందించవచ్చని తెలిపింది. ఈ డిజిటల్ కన్సెంట్ మెకానిజం పూర్తిస్థాయిలో అమలవడంతో వినియోగదారుల ప్రైవసీకి రక్షణ, స్పామ్‌తో కూడిన మోసాలకు చెక్ పడే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.






