యమపాశమైన పెళ్లి ఆవేదన.. వీడిన రైతు హత్య మిస్టరీ

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-06-29 20:54:56  IST  )

పెళ్లి కావడం లేదన్న బాధను ఆధ్యాత్మిక వేదికపై వ్యక్తపరచి వైరల్ అయిన మధ్యప్రదేశ్‌కు చెందిన రైతు ఇంద్రకుమార్ తివారీ ( 45) దారుణ హత్యకు గురవడం కలకలం రేపుతోంది.

యమపాశమైన పెళ్లి ఆవేదన.. వీడిన రైతు హత్య మిస్టరీ
X

దిశ, వెబ్‌డెస్క్: పెళ్లి కావడం లేదన్న బాధను ఆధ్యాత్మిక వేదికపై వ్యక్తపరచి వైరల్ అయిన మధ్యప్రదేశ్‌కు చెందిన రైతు ఇంద్రకుమార్ తివారీ ( 45) దారుణ హత్యకు గురవడం కలకలం రేపుతోంది. ఒక నకిలీ పేరుతో పరిచయమైన మహిళ, అతని ఆస్తిపై కన్నేసి, కిరాతకంగా హత్య చేయించిన ఘటనను పోలీసులు ఛేదించారు.

జబల్‌పూర్ జిల్లా పడ్వార్ గ్రామానికి చెందిన ఇంద్రకుమార్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ.. 18 ఎకరాల భూమిని సాగు చేసుకుంటున్నాడు. వయస్సు పెరిగినా పెళ్లి కావడం లేదన్న బాధతో ఇటీవల ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో తన ఆవేదనను బహిరంగంగా చెప్పాడు. “18 ఎకరాల భూమి ఉంది. కానీ పెళ్లి కావడం లేదు” అనే అతని మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఈ వీడియో చూసిన ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన నిందితురాలు సాహిబా బాను 'ఖుషీ తివారీ' అనే నకిలీ పేరుతో పరిచయం పెంచింది. తాను కూడా బ్రాహ్మణ వర్గానికి చెందిన అనాథనని చెప్పి, పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించింది. అనంతరం అతడిని కుషీనగర్‌కు రప్పించి, నామమాత్రపు పెళ్లి అనంతరం అతని వద్ద ఉన్న నగదు, ఆభరణాల కోసం పథకం వేసింది. జూన్ 6న కుషీనగర్‌లో ఓ రహదారి పక్కనున్న పొదల్లోకి తీసుకెళ్లి, అతని మెడపై కత్తితో దాడి చేసి హత్య చేశారు. అనంతరం నగదు, బంగారం తీసుకొని ఆమె ముఠా అక్కడి నుంచి పారిపోయింది.

పోలీసులు గుర్తుతెలియని మృతదేహంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు మధ్యప్రదేశ్‌కు చెందిన ఇంద్రకుమార్ అని స్పష్టమైన తర్వాత, అతని కాల్ డేటా, సోషల్ మీడియా లింకులు ఆధారంగా నిందితురాలిని గుర్తించారు. 'ఖుషీ తివారీ' పేరు నకిలీగా తేలడంతో అసలు పేరు సాహిబా బాను అని నిర్ధారించారు. ఆమె నకిలీ ఆధార్ కార్డు ఉపయోగించి ఈ మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు.

ప్రధాన నిందితురాలిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నామని, మిగిలిన ముఠా సభ్యుల కోసం గాలింపు కొనసాగుతోందని కుషీనగర్ ఎస్పీ సంతోష్ కుమార్ వెల్లడించారు. ఈ ఘటన ఆన్‌లైన్ పరిచయాల్లో ఉండే ప్రమాదాలపై తీవ్ర హెచ్చరికగా మారింది. సోషల్ మీడియాలో వ్యక్తిగత వివరాలను పంచుకోవడంపై అప్రమత్తత అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

Next Story